స్వామి వారి వాహన సేవల్లో అత్యంత విశిష్టమైనది గరుడ సేవ. మలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతి పాత్రమైన గరుడునిపై తిరుమాఢ వీధుల్లో ఊరేగే ఆ మనోహర దృశ్యం వీక్షించేందుకు భక్తులు ఎంతో ఆరాటపడతారు. ప్రతి పౌర్ణమి నాడు స్వామి వారు గరుడునిపై తిరుమాఢ వీధుల్లో తిరుగాడుతారు. అయితే ఈ ఆగస్టు నెలలో మాత్రం స్వామి వారికి రెండుసార్లు గరుడ సేవ నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ముందుగా ఆగస్టు 13వ తేదీన శుక్రవారం రోజున గరుడ పంచమి పర్వదినం తిరుమలలో జరగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు భక్తలను అనుగ్రహిస్తారు. ప్రతీ ఏడాదీ తిరుమలలో గరుడ పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం.
ఆ తర్వాత ఆగస్టు 22వ తేదీన ఆదివారం రోజున పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీ వారు గరుడునిపై ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగి దర్శనమిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.
