
తపస్సుకు ముందు అడ్డంకులు తొలగించేందుకు ఆమె గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేసింది. ధ్యానంలో మునిగిపోయిన పార్వతి, గణేశుడి ఆశీస్సులతో శని దోషం నుంచి విముక్తి పొందింది. ఆ తర్వాత గణపతికి అభిషేకం చేయాలనే తపనతో నీరు కోసం వెతికినా దొరకలేదు. అప్పుడు ఆమె బ్రహ్మ దేవుని ప్రార్థించగా, బ్రహ్మ తన కమండలం నుంచి పవిత్ర జలాన్ని ప్రసాదించాడు. ఆ నీరు అక్కడే ప్రవహించి బ్రాహ్మి నదిగా మారింది. ఈ కారణంగా ఇక్కడి గణపతిని కమండల గణపతి అని పిలుస్తారు.బ్రాహ్మి నది ప్రత్యేకత ఏమిటంటే, తామర రేకుల ఆకారంలో చెక్కబడిన రాతి వేదికలోని రంధ్రం నుంచి నిరంతరం పవిత్రజలం ప్రవహిస్తూనే ఉంటుంది.
శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ ఇది ఒక రహస్యమే. ఈ పవిత్ర జలాన్ని కమండల తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడి పవిత్ర జలానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ నీటిలో స్నానం చేస్తే శని దోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా పిల్లలు ఈ జలాన్ని తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, చదువులో విజయం సాధిస్తారని విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలివచ్చి పవిత్ర జలంలో స్నానం చేసి, విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా మహిళలు ఇక్కడ పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. గర్భగుడిలో గణేశుడిని దర్శించుకొని, కమండల తీర్థంలో స్నానం చేసినవారు కొత్త ఆరంభాలకు అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.