హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయ‌క చ‌వితి ఒక‌టి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వినాయ‌క చ‌వితి ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థ తిథి నాడు వ‌స్తుంది. ఈ పండుగ వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక విశిష్టత దాగి ఉంది. చ‌వితి నాడు విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ద్వారా విద్యలో విజయాలు, వ్యాపారాలలో అభివృద్ధి, కుటుంబంలో ఐక్యత, ఆరోగ్యం, సుఖశాంతి, ఆర్థిక స్థిరత్వం క‌లుగుతాయ‌ని విశ్వ‌సిస్తారు. అందుకే వినాయక చవితి రోజున భక్తులు ఎంతో శ్రద్ధగా గణపతి పూజ చేస్తారు. అయితే తెలియ‌క కొన్ని తప్పులు చేస్తే ఆ పూజ ఫలితం తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వినాయ‌క చ‌వితి రోజు పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని త‌ప్పులు ఏంటో తెలుసుకుందాం ప‌దండి.


పండుగ నాడు గణపతిని మట్టి విగ్రహంగా ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్ట చేస్తారు. అయితే విగ్రహం పగిలిపోతే లేదా లోపం ఉంటే దాన్ని పూజ‌కు ఊప‌యోగించ‌కూడ‌దు. పగిలిన విగ్రహం పూజిస్తే శుభఫలితాలు లభించవు. కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ‌లు జ‌ర‌పాలి. విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి ఉంచాలి. పొర‌పాటున కూడా పశ్చిమం వైపు పెట్ట‌కూడ‌దు.


వినాయక చవితి రోజున మాంసాహారం, మద్యపానం పూర్తిగా నివారించాలి. ఇవి పూజ పవిత్రతను దెబ్బతీస్తాయి. ఈ రోజు శాకాహారమే తీసుకోవాలి.


అలాగే గ‌ణ‌ప‌తి పూజ‌లో తులసి దళం వాడకూడదు. గణపతికి తులసి దళం నైవేద్యంగా అర్పించ‌డం నిషిద్ధం. ఆయనకు ఇష్టమైనవి 21 రకాల పత్రి ఆకులు. వాటితో పూజ చేయాలి.


విజ‌య‌క చ‌వితి అంటేనే శాంతి, ఐక్యతకు ప్రతీక. కాబ‌ట్టి పండుగ రోజు ఇత‌రుల‌తో విభేదాలు, కోప‌డ‌టం, తిట్టుకోవ‌డం అనర్థం. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉండేలా చూసుకోండి.


వినాయ‌క చ‌వితి రోజు న‌ల్ల దుస్తులు ధ‌రించ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. ప‌సుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు శుభప్రదమ‌ని అంటున్నారు.


చాలా మంది ఖాళీ కడుపుతో పూజ ప్రారంభించారు.  కానీ, ఖాళీ కడుపుతో వినాయక పూజ చేయకూడదు. ముందుగా ఒక లఘు భోజనం చేసి పూజలో కూర్చోవాలి. చివర్లో నైవేద్యం తప్పక స్వీకరించాలి.


వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడటం వ‌ల్ల అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి చంద్రుణ్ని చూడకూడ‌కుండా ఉండండి. పొరపాటున చంద్రుణ్ని చూశారంటే సమంతకమణి కథ వినడం లేదా సింధూరారుణ విగ్రహం శ్లోకం చదవడం ద్వారా దోషం తొలగిపోతుంది.


ఇక ప్రతిష్టించిన గణపతిని పూజ పూర్తయ్యాక యథావిధిగా నీటిలో నిమజ్జనం చేయాలి. ఇంట్లో ఉంచుకోవ‌డం శుభం కాద‌ని  శాస్త్రాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: