దేవతలు - అసురులు కలిసి పాలసముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఆత్మలింగం కూడా ఉద్భవించింది. తారకాసురుడు అనే రాక్షసుడు ఆ ఆత్మ లింగాన్ని మెడలో ధరించి మరణం లేకుండా వరం ఇవ్వమని శివుడిని ఉద్దేశించి ఘోరమైన తపస్సు చేశాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన సంతతిపై యుద్ధం చేయనంతవరకే మరణం ఉండదని ఆ నిబంధన ధిక్కరిస్తే మాత్రం తల వెయ్యి ముక్కలు అవుతుందని.. ఆత్మలింగం ఐదు శాఖలగా మారుతుందని హెచ్చరించాడట. కాలక్రమంలో తారకాసురుడు ఆ విషయం మరిచిపోయి శివుడి కుమారుడు అయిన కుమారస్వామితో తలపడ్డాడు. దీంతో స్వామి చెప్పినట్టుగా ఆ అసురుడి తల వెయ్యి ముక్కలైందట. ఆ సమయంలో ఆత్మ లింగం ఐదు భాగాలుగా విడిపోయిందట.
దీంతో దేవతలు ఆ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలు. అందులో మొదటి దాన్ని ఇంద్రుడు అమరావతిలో .. రెండో దాన్ని చంద్రుడు భీమవరంలో , మూడోదాన్ని విష్ణుమూర్తి పాలకొల్లులో , నాలుగో దాన్ని కుమారస్వామి సామర్లకోటలోని భీమేశ్వరంలో ప్రతిష్టించారట. మిగిలిన 5వ భాగాన్ని సప్త ఋషులు ద్రాక్షారామంలో ప్రతిష్టించాలి అనుకున్నారట. తమ ఆధ్యాత్మిక శక్తితో గోదావరి జలాలను ఇక్కడికి తరలించేందుకు పూనుకున్నారట. ఆ ప్రయత్నం ఆలస్యం కావడంతో స్వామి తనంతట తానే ప్రతిష్టుడై స్వయంభువుగా కొలువు తీరారని .. తర్వాత సూర్య భగవానుడు దిగివచ్చి పరమేశ్వరుడిని పూజించాడని ప్రతీతి. చాళుక్య ప్రభువైన చాళుక్య భీముడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి.
నాలుగు ప్రైవేటు ద్వారాలతో ఎత్తైన గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలో గర్భగుడి రెండు అంతస్తులో ఉంటుంది. భక్తులు ముందుగా పానపట్టంలో సగభాగాన్ని పూజించి అక్కడే ప్రదక్షణ పూర్తి చేసుకుని తర్వాత మెట్లు ఎక్కి రెండో అంతస్తుకు చేరుకుంటారు. ద్రాక్షారామం చుట్టుపక్కల భూగర్భంలో దొరికిన 108 శివలింగాలను ఆలయ ప్రాంగణంలోని రెండో ప్రాకారంలో భీమసభ పీఠంపై ప్రతిష్టించారు. వాటినే అష్టోత్తర లింగాలుగా పిలుస్తారు. మహాశివరాత్రి కార్తీక ఉత్సవాలతో పాటు ఏడాది పొడవున నిర్వహించే విశేష పూజలలో పాల్గొనేందుకు.. రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు కాకినాడ - అనపర్తి - సామర్లకోట రైల్వే స్టేషన్లలో దిగితే సరిపోతుంది. అక్కడ నుంచి బస్సులు, ఆటోలు ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి