2025 ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. జూన్ 20న మొదలయ్యే ఈ సిరీస్ ఆగస్టు వరకు కొనసాగనుంది. అయితే, ఈ టూర్‌కు టీమిండియాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు జట్టుకు కొత్త కెప్టెన్ అవసరమైంది.

ఇదివరకు జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ గైర్హాజరీలో టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో అతడే తదుపరి కెప్టెన్ అయ్యే అవకాశముందనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కానీ, రవిశాస్త్రి మాత్రం దీనికి తీవ్రంగా అభ్యంతరం చేసాడు. ఐసీసీ సమీక్షలో మాట్లాడుతూ.. బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. అతడిని కెప్టెన్ చేస్తే మనం గొప్ప బౌలర్‌ను కోల్పోతాం. గాయాల నుంచి వచ్చిన అతడికి పూర్తి శ్రద్ధ బౌలింగ్‌పైనే ఉండాలి. టెస్టుల్లో అతడు 10 నుంచి15 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. పైగా కెప్టెన్సీ ఒత్తిడి అతడిపై పెట్టకూడదు అని అభిప్రాయపడ్డారు.

కెప్టెన్‌షిప్ కోసం మరో అవకాశంగా శుభ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి సూచించారు. గిల్ 25 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. అతడు బ్యాటింగ్‌లో నిరంతరం మెరుగవుతుండటమే కాకుండా మంచి క్రికెట్ అర్ధం చేసుకునే సామర్థ్యం కలిగిన ఆటగాడు. అతనికి ఇప్పుడు నాయకత్వ అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అలాగే రిషబ్ పంత్ పేరు కూడా రవిశాస్త్రి ప్రస్తావించారు. పంత్‌కు కూడా కెప్టెన్సీ అనుభవం ఉందని, అతడు కూడా భవిష్యత్‌లో కీలక నాయకుడిగా ఎదిగే అవకాశముందని చెప్పారు. ఈ ఇద్దరూ దశాబ్ధ కాలానికి పైగా జట్టుకు సేవలందించగల ఆటగాళ్లని అభిప్రాయపడ్డారు.

ఇక భారత టెస్ట్ క్రికెట్‌లో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమవుతోంది. రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల టెస్ట్ నుంచి విరమణతో జట్టుకు మార్పులు తప్పవు. టెస్ట్ కెప్టెన్ ఎంపిక ఈ మార్పులో కీలక భాగం. జట్టులో యువ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శుభ్‌మన్ గిల్ లేదా రిషబ్ పంత్ వీరిలో ఎవరు నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: