ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అంటే ఒక ప్రత్యేకమైన స్థానమే. దాదాపు అర్ధశతాబ్దం పాటు ఆయన వివిధ పార్టీలలో పని చేసినా, ఎక్కడ ఉన్నా తన దైన మార్క్ రాజ‌కీయం చేశారు. కాంగ్రెస్‌తో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం, బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, అనంతరం వైసీపీ వరకు సాగింది. ముద్ర‌గ‌డ మామూలు రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయ‌కుడిగాను కీర్తింప‌బ‌డ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపుగా చేతుల్లో ఉన్నా కూడా కాపుల ఆకాంక్షల కోసం ఆ అవకాశాన్ని వదిలేయడం ముద్రగడ ధోరణి ఎంత భిన్నమైనదో చూపిస్తుంది. ముద్ర‌గ‌డ అంటే కాపు వర్గం నుంచి గౌరవం, నమ్మకం ఇప్పటికీ చాలా వ‌ర‌కు అలాగే ఉన్నాయి. వ‌యోఃభారం, ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం వెనక్కి వెళ్లినా.. ఇటీవల తన ఆరోగ్యం మెరుగైందని తెలిపారు. జగన్‌ను 2029లో సీఎం చేయడానికి తాను కృషి చేస్తానని ప్రకటించడంతో వైసీపీ కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించింది. అదే సమయంలో ఆయన కుమారుడు ముద్రగడ గిరిని ప్రత్తిపాడు ఇంచార్జిగా నియమించడం వైసీపీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో స్పష్టం చేస్తోంది.


అయితే గోదావరి జిల్లాలో మారుతున్న సామాజిక - రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ హైకమాండ్ ముద్రగడ ఫ్యామిలీపై భారీ బాధ్యతలు వేయాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్తిపాడు కంటే పిఠాపురం నుంచి ముద్ర‌గ‌డ వార‌సుడు గిరిని పోటీ చేయించాలని ఆలోచన జరుగుతోందట. ముద్రగడకు పిఠాపురంలో బలమైన అనుచర వర్గం ఉండటం, ఆయనకు ఆ ప్రాంతంపై సహజమైన పట్టు ఉండటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా క‌నిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న వంగా గీత పనితీరుపై వైసీపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని, ఆమె కూడా పిఠాపురం సీటు వద్దని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం. దీంతో పిఠాపురం వైసీపీ భవిష్యత్తు పూర్తిగా ముద్రగడ కుటుంబం చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తోంది.


ఇక పవన్ కళ్యాణ్‌పై వైసీపీ వేసే లెక్కలు వేరే. ఆయన ఒక ‘రూటిన్ పొలిటిషియన్’ కాదని, కానీ 2024లో ఆయనను కాపు వర్గం భావోద్వేగంతో గెలిపించిందనే అభిప్రాయం వైసీపీకి బలంగా ఉంది. కూటమి పాలన పట్ల కాపులలో పెరుగుతున్న అసంతృప్తి 2029 నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అలాంటి సమయంలో పవన్‌ను ఎదుర్కోవడంలో ముద్రగడ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తూ, వ్యూహాలు రచిస్తోంది. ఇదంతా చూస్తే పిఠాపురంలో “పవన్ వర్సెస్ ముద్రగడ” సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టే. అయితే ఈ మాస్టర్ ప్లాన్‌పై ముద్రగడ ఎంతవరకు ముందుకు వస్తారన్నది ఇప్పటికీ ఆసక్తికర ప్రశ్నగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: