యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన.. చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఒప్పందాలు, అందులో మార్పులు, వాటిపై కేసులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ దాటుకొని ఇప్పుడు ఈ యుద్ధ విమానం భారత చేతికి వచ్చింది. అసలు ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రెండు దశాబ్దాల కిందట వాజపేయి హయాంలో యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ప్రత్యర్థులను దాడిచేసే మారణాయుధాలు భారత వైమానిక దళంలో తక్కువగా ఉన్నాయి. అయితే భారత వైమానిక దళాన్ని మరింత గొప్పగా బలోపేతం చేయాలన్నా, ప్రత్యర్థులను ఎదుర్కోవాలన్నా అంతకుమించి బలమైన ఆయుధం ఏదో కావాలి. అప్పుడు అలా మొదలైన ఆ ఆలోచనే రాఫెల్.
అయితే వాజపేయి హయాంలో 2000వ సంవత్సరంలో యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన, తిరిగి ఆచరణ పొందింది మాత్రం 2007 వ సంవత్సరం యూపీఏ ప్రభుత్వంలో. యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఎన్నో ప్రతిపాదనలను చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ కు యుద్ధ విమానాలను సరఫరా చేసే అగ్రిమెంట్ ను దక్కించుకునేందుకు బోయింగ్ ఎఫ్ - 18 సూపర్ హార్నెట్, లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్ 16, రాఫెల్, యూరో ఫైటర్ టైఫూన్, మికోయాన్ మిగ్ -35, సాబ్ జే ఏ ఎస్ -39 గ్రిపెన్ పేరిట ఆరు అగ్రశ్రేణి యుద్ధ విమానాల తయారీ సంస్థల కంపెనీలు పోటీ పడ్డాయి.
సాంకేతికంగా,సమగ్ర నిర్వహణ చేసిన తర్వాత రాఫెల్, టైఫూన్ ల విమానాలను కొనుగోలు చేసేందుకు 2011లో యూపీఏ-2 ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. ఈ రెండింటిలో రాఫెల్ ధర తక్కువ కావడంతో, రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని 2012 లో నిర్ణయించుకుంది. యూపీఏ ప్రభుత్వం రూ.54,000 కోట్ల రూపాయలు పెట్టి,126 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఒప్పందం తీసుకుంది. వీటిలో రెడీగా 18 విమానాలను వెంటనే డెలివరీ చేయడం,ఆ తర్వాత 108 యుద్ధ విమానాలను బెంగళూరులోని హిందూస్థానీ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారుచేయడానికి ఫ్రాన్స్ కు డీల్ కుదిరింది.
కానీ 2014 లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందం అంతా ఒక్కసారిగా తారుమారైంది. 2015 లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ 2012 లో 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ఒప్పందాన్ని ఒక్క సంతకం తో రద్దు చేశాడు. కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక్కో రాఫెల్ జెట్ కు సగటున రూ.715 కోట్లు పడుతుందని, నాటి రక్షణ మంత్రి మనోహర్ బారికర్ చేసిన ప్రకటన అందరినీ విస్తుపోయేలా చేసింది. నిజానికి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఒక్కో రాఫెల్ జెట్ ను రూ. 530 కోట్లకి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే వీటి ధర రూ.715 కోట్ల వద్ద కూడా ఆగకుండా ఏకంగా ఒక్కో జెట్ ధర రూ.1670 కోట్లకు మారింది.
యూపీఏ హయాంలో 126 జెట్ లకు గాను కేవలం రూ. 54 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ గా పెట్టిన ప్రభుత్వం, కానీ ఇప్పుడు కేవలం 36 విమానాలకు రూ.58 వేల కోట్ల రూపాయలను బీ జే పీ ప్రభుత్వం ఇవ్వనుంది.అయితే ఆనాడు యూపీఏ ప్రభుత్వం బెంగళూరులోని హిందూస్థానీ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో యుద్ధ విమానాలు తయారు చేయడానికి ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ బీ జే పీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. భారత సైనిక దళానికి ఎన్నో యుద్ధ విమానాలు తయారు చేసి పెట్టిన ఘనత ఒక్క హిందుస్థాని ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు మాత్రమే ఉంది. అయితే ఆ హాల్ మార్క్ ను పక్కన పెట్టి ఇప్పుడిప్పుడే పేపర్లో పడుతున్న అనిల్ అంబానీ డిఫెన్స్ కంపెనీకి కట్టబెట్టారు.
అయితే ఎన్నో అపోహలు తరువాత 2019 సంవత్సరంలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ స్వీకరించాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ తో ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఒక గేమ్ రేంజర్ గా ఈ రాఫెల్ ఉండబోతోంది. అయితే రీసెంట్ గా 72వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని రాఫెల్ యుద్ధ విమానాలు గగనంలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా నిప్పులు వెదజల్లే గుండంలా గా తమ విన్యాసాలను ప్రదర్శించాయి రాఫెల్ యుద్ధ విమానాలు. ఈ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చిన తరువాత భారత వైమానిక దళం మరింత బలపడింది అని చెప్పవచ్చు. ఇక చైనా,పాకిస్థాన్ దేశాల వెన్నులో వణుకు పుట్టించేలాగా ఈ యుద్ధ విమానాలు యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి