
అయితే, ఈ డిజిటల్ లావాదేవీలే అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేశాయి. ఇటీవల జీఎస్టీ అధికారులు అతనికి రూ. 29 లక్షల నోటీసు జారీ చేశారు. కారణం? నాలుగేళ్లలో అతని అకౌంట్స్ ద్వారా రూ. 1.63 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఇది GST నమోదిత టర్నోవర్ పరిమితిని మించి పోయింది. అందుకే ఆయనపై 29 లక్షల జీఎస్టీ బకాయిలను వసూలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. శంకర్‌గౌడ ఈ విషయంపై స్పందిస్తూ, "నేను రోజూ కూరగాయలు కొని, కొంత శాతాల్లో లాభంతో అమ్ముతాను. వాటి రికార్డులన్నీ నాకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐటీఆర్ కూడా ఫైల్ చేస్తున్నాను. అయినా ఇంత పెద్ద నోటీసు రావడం నన్ను ఆందోళనకు గురిచేసింది. నా జీవితంలో ఈ స్థాయి డబ్బు ఎప్పుడూ చూడలేదు," అని అన్నారు. వాస్తవానికి, ప్రాసెసింగ్ లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన తాజా కూరగాయలపై GST వర్తించదు. కానీ, అవి ప్యాకింగ్ చేయబడి ఉంటే, లేదా బ్రాండ్ చేయబడి ఉంటే, వాటిపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ అంశంలో అధికారులు వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు అంగీకరించడం మానేశారు. నగదుతో మాత్రమే లావాదేవీలు చేస్తున్నారు. వాస్తవానికి డిజిటల్ ఇండియాకు ఇది వ్యతిరేకంగా వెళుతోంది. కర్ణాటక జీఎస్టీ విభాగం ప్రకారం, వారు ఇప్పుడు టర్నోవర్ పరిమితికి మించి ఉన్న చిన్న వ్యాపారులపై సమగ్ర నిఘా ఉంచారు. జూలై 12న గడువు పూర్తయ్యే నాటికి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపతామని ప్రకటించారు. ఈ ఘటన చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి చేసుకునే వారికి గట్టి మెసేజ్‌గా మారింది. డిజిటల్ చెల్లింపులు ఎంత సౌలభ్యం కలిగించినా.. పన్ను నిబంధనలపై అవగాహన లేకుంటే సమస్యలు తప్పవు. ఇకపై చిన్న వ్యాపారులు కూడా తమ లావాదేవీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది.