ప్రతి మనిషికి తన జీవితంలో ఎన్నో బంధాలు, భాద్యతలు ఉంటాయి. తమ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. తండ్రికి కుటుంబ బాధ్యత..పిల్లల్ని పెంచి పోషించాలి, వారికి అందమైన భవిష్యత్తు ఇవ్వాలి. అదే విధంగా పిల్లలకు తల్లి తండ్రులు కోరుకున్న బిడ్డలుగా మారాల్సిన బాధ్యత ఉంటుంది. వారి ఆకాంక్ష మేరకు గొప్ప స్థాయికి చేరుకోవాలి. అదే విధంగా వారికి నచ్చిన మార్గంలో నడవాలని ఉంటుంది. ఇలా ప్రతి మనిషి చుట్టూ ఎన్నో బాధ్యతలు అల్లుకుని ఉంటాయి. అయితే అన్నిటికీ కేంద్రం సమయం (కాలం) అవుతుంది. మనం ఏం చేయాలనుకున్నా, ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలన్నా దానికి ప్రారంభం వర్తమానము అవుతుంది. 

మనం జీవితంలో ఏం సాధించాలన్నా ఎలాంటి  గమ్యాన్ని చేరుకోవాలన్నా...అందుకు ముందడుగు వెంటనే పడాలి. అలా కాకుండా నిదానంగా చేద్దాంలే అనుకుంటే సరిపోదు. అందుకు మన వంతు ప్రయత్నం వెంటనే శర వేగంతో, దృడ సంకల్పంతో, పూర్తి నమ్మకంతో మొదలు పెట్టాలి. అది పూర్తి అయ్యే వరకు కృషి చేయాలి. జీవితంలో, వ్యక్తిత్వ వికాసంలో, లక్ష్యాల్లో, సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలి. అనుకున్న దానిని సమయానికి సాధించగలం అన్న నమ్మకం పెంచుకోవాలి. 

కాలం చాలా విలువైనది వృధా చేసే ఈ క్షణము మళ్లీ తిరిగి రాదు. ఉదాహరణకు నీవు ఒక్క గంటలో  ఒక పాఠాన్ని నేర్చుకొనవచ్చును...ఒక వేళ కష్టం అనుకొని  అదే గంట వృధా చేస్తే నీ వద్ద ఆ గంట తాలూకు శ్రమ ఫలితం ఉండదు. ఆ తరువాత అనుకుంటే  చేయవచ్చు. కానీ అదే వృధా అయిన గంట నీ జీవితం లోకి ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఏదైనా సరే సమయానికి చెయ్యాలి. అప్పుడే ఆ పనికి విలువ ఉంటుంది. కాబట్టి సమయాన్ని గౌరవించు. అది నీకు ఎన్నో విజయాలను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: