నేపాల్ యువతి బిహారీ గ్యాంగ్‌ కు చిక్కి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు విషయం ఏమిటంటే.. ఆ యువతికి మోడలింగ్ రంగంలోకి రావటం అనేది ఓ కల. ఈ రంగంలో  ఎలానైనా రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేది ఆమె కోరిక. ఈ విషయాన్ని ఆసరా చేసుకున్న ఓ మహిళా తన ఆసక్తిని గమనించి మోడల్‌ ను చేస్తామని నమ్మించింది. ఆ మహిళ ఆ యువతిని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి ఓ గ్యాంగ్‌ కు అప్పగించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి గ్యాంగ్ ఆఖరి నిమిషంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.


అసలు విషయమేంటో తెలుసుకుందాం... నేపాల్‌ కు చెందిన ఓ యువతి మోడల్‌ గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెకు ఇటీవల బిహార్‌ కు చెందిన మహిళ ఆన్‌ లైన్ లో పరిచయమైంది. ఇండియాకు వస్తే మోడల్‌ ని చేస్తానని, భోజ్‌ పురి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని మహిళ చెప్పడంతో ఆ యువతి నమ్మేసింది. 


దీంతో ఆ మహిళతో పాటు మరో ఆరుగురు కలిసి ఆమెను ఖాట్మండ్ నుంచి బిహార్‌ లోని బోగ్బానీకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో గ్యాంగ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు అక్కడ తనిఖీలు చేసి యువతిని రక్షించారు. ఆమెను బిహార్‌ కు తీసుకొచ్చిన ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సూర్యగ్రహణం రోజున కన్యను బలి ఇస్తే మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే ఆమెను తీసుకొచ్చినట్లు చెప్పడంతో అంతా షాకయ్యారు. 


అయితే నరబలి ఇచ్చేందుకు ఎవరో వీరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి రూ.1,09,500 నగదు, మొబైల్ ఫోన్స్, రూ.9 లక్షలకు సంబంధించి ఏడు బ్యాంక్ చెక్కులు, ఏడు ఏటీఎం కార్డులు, నరబలి, క్షుద్రపూజలకు వినియోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను తిరిగి నేపాల్‌ కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌ లైన్‌ లో పరిచయమైన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు చెప్పినదంతా నమ్మింతే ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు ఆమెకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: