ఈ మద్య కాలుష్యం, మనం తినే తిండి పదార్ధాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రయత్నాలు చేసినా 80శాతం మంది స్త్రీ ల తలవెంట్రుకలు తెల్లబడటం, పలచబడటం,ఊడిపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేశాల సంరక్షణకోసం తీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు యోగాపరంగా ఉన్న పరిష్కార మార్గాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.మరి అవి ఏమిటంటే...  దినచర్యలు : ఆహారం, దినచర్య, నిద్ర, వ్యాయామం సరైన క్రమంలో లేకపోవటం కూడా కేశాల సమస్యలకు కారణమవుతాయి. ఆహారం కేశాల రక్షణకు 15 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 80 నుంచి 100 గ్రాముల ప్రొటీన్లు మధ్య వయసు కలవారు 60నుంచి 80 గ్రాముల వరకు ప్రొటీన్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి.


ఆవుపాలు (స్వదేశీఆవుపాలు శ్రేయస్కరం) పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, సోయాబీన్స్‌ ఇవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్‌ ఎ, బి ,ఐరన్‌, కాపర్‌, అయొడిన్‌ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, తేనె, కాలానుగుణంగా లభించే పళ్లు, మొలకెత్తిన గింజలు, గోధుమ గడ్డి జ్యూస్‌, గోధుమ పదార్ధాలు విశేష లాభాన్నిస్తాయి. అంతేకాకుండా సమయానుకూలంగా, కాలానికి తగినట్టుగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కేశాల సంరక్షణ కోసం: తలస్నానం చన్నీటితో చేయాలి. స్నానానికి కుంకుడు రసం వాడాలి. స్నానానంతరం వేళ్లతో జుట్టు కుదుళ్లకు ఆ ప్రాంతంలో వేడి పుట్టేలా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివలన తలలోనినాడులు చైతన్యవంతమై రక్తప్రసరణ మెరుగుపడి కేశాలసంరక్షణ జరుగుతుంది.


కొబ్బరినూనెలో ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి వేడిచేసి తలవెంట్రుకలకు పట్టించాలి. బచ్చలి ఆకురసం సేవించడం లేదా ఆకుని ఆహారంగా వాడటం వలన కురులు అందంగా, ఒత్తుగా పెరుగుతాయి. క్యారట్‌జ్యూస్‌ కూడా కేశాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి వెంట్రుకలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవటం ఆగుతాయి. కొత్తిమీర ఆకులను రసం తీసి తల వెంట్రుకలకు పట్టించాలి. ఆవనూనెలో గోరింటాకులను వేసి వేడిచేసి చల్లారిన తరువాత తలవెంట్రుకలకు పట్టించడం, కుదుళ్లకు బలాన్నిస్తుంది. కొబ్బరిపాలను తలపై పోస్తూ బాగా మర్దించినట్లైతే వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారై ఊడటం ఆగుతుంది. మినపప్పు ఉడికించి పేస్ట్‌లా చేసి, కొంచెం మెంతిపొడిని కలిపి వెంట్రుకలకు పట్టిస్తే విశేష లాభం ఉంటుంది. చాలామంది కోడిగుడ్డుని వెంట్రుకలకు అప్లయి చేస్తుంటారు. కానీ దీనివలన జుట్టుకు అనుకున్నంత ప్రయోజనం చేకూరకపోగా దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది.


అందమైన శిరోజాలు


వెంట్రుకలు చిట్లిపోవటం, బిరుసుగా అవటం, కాంతిహీనంగా మారటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది ప్రకృతి విరుద్ధంగా భావించాలి. ఇది భారతీయ వైద్య విజ్ఞానానికి విరుద్ధం. రేగడి మట్టిలో ఉసిరిక, నిమ్మ కాయ, కొత్తిమీర రసం వీటిలో దేనినైనా కలిపి పేస్ట్‌లా చేసి తలవెంట్రుకలకు అప్లయి చేసి ఆరిన తరువాత స్నానం చేయాలి. ఈ పద్ధతులను ఆరునెలలపాటు ఆచరించినట్లైతే విశేషలాభాలు పొందవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆసనాలు:  పైన చెప్పిన కురుల సమస్యలకు విరుగుడుగా ఈ ఆసనాలు పనిచేస్తాయి.8నుంచి 30 సంవత్సరాల లోపు వయసుండి ఆరోగ్యవంతులైనవారికి శీర్షాసనం, సర్వాంగ పద్మాసనం, విపరితకరణి, వృచ్ఛికాసనం, వృక్షాసనం, చక్రాసనం, టిట్టిభాసనం వేయవచ్చు.


నల్లని కురులు


ఆపై వయసుండి ఆరోగ్యంగా ఉన్నవారు (అనగా బిపి, అధిక బరువు, హృదయ సంబంధవ్యాధులు లేనివారు) అర్థ శీర్షాసనం, సర్వాంగాసనం, పాదహస్తాసనం, హలాసనం, అర్థటిట్టిభాసనం (వీటి సాధన గురించి వచ్చే వారాల్లో విశదంగా తెలుసుకుంటారు) యోగనిద్రాసనం వేయవచ్చు. శరీరం బిరుసుగా ఉండి, ఏమైనా రుగ్మతలున్నవారు సూర్యనమస్కారాలు, యోగిక్‌ వ్యాయామం, ప్రాణాయామం వీటితోపాటు పైన తెలిపిన సూచనలు పాటించాలి. ప్రాణాయామాలు నాడీశోధన, బస్త్రిక, కపాల బాతి, అంతః కుంభకం, ఆచరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: