సాధార‌ణంగా పాదాలు పగిలితే భరించలేనంత నొప్పి కలుగుతుంది. ఇక నడుస్తుంటే కలిగే బాధ వర్ణాతీతం. చాలామందిలో పాదాల చర్మం దళసరిగా మారి మంట, దురద పుడుతుంటుంది. అంతేకాకుండా చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. ఈ సమస్యకి రకరకాల కారణాలున్నాయి. పోషకాహార లోపం, ఎక్కువసేపు నిలబడి ఉండడం, ఎక్సిమా, సొరియాసిస్‌, మధుమేహం, థైరాయిడ్‌ వంటి వాటి వల్ల కూడా పాదాల పగళ్లు అధికమవుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లు వంటి సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు.

 

బాగా పండిన అరటి పండ్ల గుజ్జును పాదాల మొత్తానికి అప్లై చేసి సున్నితంగా మర్ధనా చేయాలి. కాలి వేళ్లతో సహా, కాలి మడమలు ఇలా మొత్తం మ‌ర్ధ‌నా చేసుకుని అర‌గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే పాదాల ప‌గుళ్ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్, నిమ్మరసంను నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా ఫూట్ మసాజ్ చేయడం వల్ల పాదాల పగుళ్ళ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజూ ఇలా చేస్తే త్వరగా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆముదమును పగిలిన వేళ్ళకు రాత్రి పూట పట్టించి మరుసటి రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

 

కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక అర‌గంట‌ కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్ళ పగుళ్ళనుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో వాడుకునే ఏ వంటనూనైనా పాదాల పగుళ్లకు చికిత్సగా వాడుకోవచ్చు. పాదాలను సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడి వస్త్రంతో తుడవాలి. తర్వాత‌ వంటనూనెను బాగా పట్టించి కాటన్‌ సాక్స్‌ తొడుక్కోవాలి. ఇర పొద్దున్నే వేడి నీటితో పాదాలు కడుక్కుంటే స‌రిపోతుంది. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే పాదాల పగుళ్లు త‌గ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: