గత పదేళ్లలో కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని, 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకోవడం రాష్ట్రానికి శాపంగా మారిందని రేవంత్ మండిపడ్డారు. పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? "రాష్ట్రానికి నీళ్ల పంచాయితీ కావాలా? లేక సాగునీరు కావాలా?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవడం కంటే, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయడమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇదే అంశాన్ని బీఆర్‌ఎస్ నేతలు అస్త్రంగా మార్చుకున్నారు. చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు విమర్శిస్తున్నారు.
పొలిటికల్ ట్రాప్: రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కేసీఆర్ తన పార్టీ మనుగడ కోసం మళ్ళీ 'తెలంగాణ సెంటిమెంట్'ను, 'నీళ్ల అన్యాయాన్ని' తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి ఈ వివాదంలోకి లోతుగా వెళ్లడం వల్ల లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లయిందని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎంతో చర్చలకు సిద్ధమని చెప్పడం, తెలంగాణ వాదుల్లో కొంత అనుమానాలను రేకెత్తించే అవకాశం ఉందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇప్పుడు ఆ నీళ్ల విషయంలోనే రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు 'ద్రోహి' ముద్ర వేసుకోవడం గమనార్హం. ఈ జల యుద్ధంలో చివరకు గెలిచేది రాజకీయ నాయకులా? లేక ఎండీపోతున్న పొలాలకు నీళ్లు అందుతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి