రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం ఓ చారిత్రాత్మకమన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని కోసం 600 రోజులుగా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి నియంతృత్వ పరిపాలన సాగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని నిర్మాణం కోసం రైతులు 32 వేల 323 ఎకరాలు త్యాగం చేశారన్నారు చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదన్నారు. 2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అమరావతి అని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పార్టీపై విద్వేషంతో... అమరావతిని ముఖ్యమంత్రి జగన్ ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ వల్ల ఇప్పటికే అమరావతి నుంచి 139 సంస్థలు వెనక్కి వెళ్లాయని.... దీని వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుందన్నారు. రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే... మరింత ఉధృతమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: