
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, మల్లారెడ్డి వాడుతున్న పదజాలాన్ని మల్కాజిగిరి, మేడ్చల్ ప్రజలతోపాటు తెలంగాణవాసులంతా ఆసక్తిగా గమనిస్తున్నారని భారతీయ జనతాపార్టీ మహిళానేత విజయశాంతి అన్నారు. మాట్లాడిన భాషతోపాటు ఉపయోగించిన పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉందో ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. దీంతోపాటు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికవస్తే చాలు.. అనుకునే రీతిలో ప్రజల ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువెళ్లారని విమర్శించారు. నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారని, దీనివల్ల మనం కూడా లాభపడతామనే ఆలోచనలో ప్రజలంతా ఉన్నారని, అందుకే తమ తమ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజలను ఉప ఎన్నికల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి తీసుకువెళ్లిన కేసీఆర్ భవిష్యత్తులో తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారనే భయం అందరిలో కలుగుతోందని వ్యాఖ్యానించారు.