ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. అదేంటంటే… దర్శకుడు అనిల్ రావిపూడి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కంటే ఆదాయ పరంగా ముందుకెళ్తున్నాడా? అన్న ప్రశ్న. దీనికి కారణం ఇద్దరి పని విధానం, రెమ్యూనరేషన్, సినిమాల స్పీడ్ మధ్య ఉన్న భారీ తేడానే.రాజమౌళి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పాన్ ఇండియా స్థాయి విజన్, భారీ బడ్జెట్, అంతర్జాతీయ ప్రమాణాలు. ఆయన ఒక్క సినిమాకు దాదాపుగా 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే రాజమౌళి సినిమా అంటే సాధారణంగా త్వరగా పూర్తయ్యేది కాదు. స్క్రిప్ట్ దశ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని అంశాలపై ఆయన పెట్టే శ్రద్ధ కారణంగా ఒక సినిమా రావాలంటే కనీసం 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతోంది. ఆ గ్యాప్‌లో ఆయన మరే సినిమా చేయరు. ఒకే ప్రాజెక్ట్‌కు పూర్తిగా అంకితమవుతారు.ఇక మరోవైపు చూస్తే అనిల్ రావిపూడి పూర్తిగా భిన్నమైన స్టైల్‌కు ప్రతినిధి. వినోదానికి ప్రాధాన్యం ఇచ్చే కమర్షియల్ సినిమాలతో ఆయనకు ప్రత్యేకమైన మార్క్ ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఒక్క సినిమాకు సుమారు 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. అయితే అసలు ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఆయన సినిమాల స్పీడ్. అనిల్ రావిపూడి సంవత్సరానికి ఒక సినిమా కాకపోతే రెండు సినిమాలు కూడా ఈజీగా పూర్తి చేయగల సామర్థ్యం కలిగిన దర్శకుడు.

ఈ లెక్కన చూసుకుంటే, రాజమౌళి ఒక్క సినిమా పూర్తి చేసే ఐదు సంవత్సరాల వ్యవధిలో అనిల్ రావిపూడి కనీసం మూడు నుంచి ఐదు సినిమాలు చేయగలుగుతున్నాడు. ఒక్కో సినిమాకు 40 కోట్లు చొప్పున తీసుకున్నా, మొత్తం మీద ఆయన ఆదాయం 160 నుంచి 200 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. ఇదే లెక్కను ఆధారంగా తీసుకుని “రాజమౌళి ఒక సినిమాతో ఎంత సంపాదిస్తాడో, అదే సమయంలో అనిల్ రావిపూడి ఎక్కువ సంపాదిస్తున్నాడు” అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాజమౌళి సినిమాలు కేవలం రెమ్యూనరేషన్ పరంగానే కాకుండా, ఇండస్ట్రీకి తెచ్చే పేరు, అంతర్జాతీయ గుర్తింపు, టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పే విషయంలో చాలా కీలకమైనవి. మరోవైపు అనిల్ రావిపూడి మాత్రం కమర్షియల్ సక్సెస్, నిర్మాతలకు లాభాలు, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అనే కోణంలో తనదైన మార్గంలో దూసుకుపోతున్నారు.

ఇటీవల శంకర వరప్రసాద్ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగిందని, దానికి తగ్గట్టుగానే ఇకపై ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ అలా జరిగితే, ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ మరింత ఎక్కువ సంపాదించే దర్శకుడిగా అనిల్ రావిపూడి తన స్థానాన్ని ఇంకా బలపరుచుకునే అవకాశం ఉంది.మొత్తానికి చూస్తే… రాజమౌళి క్వాలిటీ, విజన్, గ్లోబల్ ఇంపాక్ట్‌కు కేరాఫ్ అడ్రస్ అయితే, అనిల్ రావిపూడి స్పీడ్, కమర్షియల్ స్ట్రాటజీ, నిరంతర సక్సెస్‌లతో తనదైన దూకుడు చూపిస్తున్నాడు. ఇక  అనిల్ రావిపూడి ఇదే వేగంతో సినిమాలు చేస్తూ టాప్ రేంజ్‌కు చేరుతాడా? లేక కొత్త తరహా ప్రయోగాల వైపు అడుగులు వేస్తాడా? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ అండ్ స్మార్ట్ డైరెక్టర్లలో ఒకడిగా నిలుస్తున్నాడన్నది మాత్రం నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: