ఆర్థిక మాంద్యం ముప్పు మంచుకొస్తున్న వేళ.. ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు మరింత కలవరపెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్ప  వసూళ్లు నమోదయ్యాయి.  ఈ తగ్గుదలకు ఆర్థిక మందగమనమే ముఖ్య కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు జీఎస్టీ వసూళ్లపై పడింది. వసూళ్లు ఆగస్ట్‌ నెలలో లక్ష కోట్ల నుంచి 98,202 కోట్లకు పడిపోయాయని కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాల్లో ప్రకటించింది.

జులైలో జీఎస్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు  లక్షా 2 వేల లక్షల కోట్లు సమకూరగా, ఆగస్ట్‌లో పన్ను రాబడి గణనీయంగా తగ్గింది. అయితే గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 4.5 శాతం అధికం. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల దిగువకు పడిపోవడం ఇది రెండవసారి. జూన్‌లో సైతం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన  99 వేల 939 కోట్లకు తగ్గిపోయాయి. కాగా ఆగస్ట్‌లో సెంట్రల్‌ జీఎస్టీ వసూళ్లు  17 వేల 733 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ  24 bవేల 239 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 48 వేల 958 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల దిగువకు పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇది సంకేతమని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

ఉత్పాదక రంగం, సేవా రంగంలో నెలకొన్న స్తబ్ధత కారణంగానే ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని..దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపైనా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం, జీఎస్టీ తగ్గుదలతో ఆర్థిక లోటుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: