దీపావళికి ప్రభుత్వ కంపెనీలు సేల్‌కు రాబోతున్నాయా? వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని పదిరోజుల క్రితం నిర్ణయించడంతో సూచీలు నష్టపోయాయి. ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. కార్పొరేట్‌ పన్నును తగ్గించి.. రాయితీలతో ఉద్దీపన ప్రకటన చేయడంతో యూటర్న్‌ తీసుకున్నాయి మార్కెట్లు. దీంతో మార్కెట్లు మళ్లీ దూకుడు పెంచాయ్‌. ఈ సమయంలో ఐపీవోకు వచ్చే కంపెనీలకు మంచి మార్కెట్‌ విలువ లభించే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే మంచి తరుణమని భావిస్తోంది  కేంద్రం. 


మొన్నటి వరకూ నష్టాలలో కూరుకుపోయిన కంపెనీలు తిరిగి మార్కెట్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయ్‌. ఈ క్రమంలోనే ఐ.ఆర్.సి.టి.సిని ఐపీవోకు తీసుకొచ్చింది కేంద్రం. కార్పొరేట్‌ పన్ను తగ్గడం వల్ల.. కంపెనీల లాభాలు పెరగడంతోపాటు నగదు నిల్వలు వృద్ధి చెందుతాయ్‌. మంచి లాభాలు, నగదు నిల్వలు ఉన్న కంపెనీల ఐపీవోకు డిమాండ్‌ ఎక్కువ. అదీకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఒక లక్ష కోట్లను సమీకరించాలనేది మోడీ సర్కార్‌ లక్ష్యం. 30వేల కోట్ల వరకూ రుణభారంతో మూలుగుతున్న ఎయిర్ ఇండియాకు కూడా తాజా పరిస్థితులు కలిసి వస్తున్నాయ్‌. కంపెనీ కొనుగోలుకు పెట్టుబడిదారులు వస్తారని ఆశిస్తోంది ప్రభుత్వం. పేపర్‌ వర్క్‌ పూర్తికావడంతో.. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాకపోతే  దీనికి అనుమతి ఇవ్వాల్సింది మాత్రం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సారథ్యంలోని ప్రత్యేక బృందం. 


ప్రభుత్వ కార్యదర్శుల బృందం.. కొన్ని కంపెనీలలో వాటాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భారత్‌ పెట్రోలియం, బీఈఎంఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, టీహెచ్‌డీసీ ఇండియా, నీప్‌కోల్‌ ఈ జాబితాలో ఉన్నాయ్‌. పవర్‌ కంపెనీలను ఎన్‌టీపీసీ విలీనం చేసుకోనుంది. ఒక్క బీపీసీఎల్‌లోనే ప్రభుత్వ వాటా 55వేల కోట్ల వరకూ ఉంది. బుల్‌ జోరు మీద ఉండటంతో వాటాల విక్రయానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది కేంద్రం.  దీంతో దీపావళి ధమాకా సేల్‌ మాదిరి.. మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాల విక్రయాలు ఊపందుకునే వీలుంది. 







మరింత సమాచారం తెలుసుకోండి: