వాట్సాప్ తాజాగా తన సెక్యూరిటీ విధానాలను మార్చింది. ఈ విధానాల ప్రకారం.. ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డేటాను వారి వారి ఫేస్‌బుక్ ఖాతాలకు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. దీంతో వినియోగదారులకు ఆగ్రహం వచ్చింది. ఈ కొత్త విధానంపై ఎలాన్ మస్క్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సిగ్నల్ యాప్’ను వాడుకోవాలని సలహా ఇచ్చాడు. అంతే వాట్సాప్ వినియోగదారులు పడిపోవడం, సిగ్నల్ వినియోగదారులు మిలియన్లలో పెరిగిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోయింది.
తప్పు తెలుసుకున్న వాట్సాప్ తన నిబంధనలను సవరించింది. కానీ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ మధ్య గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి సిగ్నల్ యాప్‌ను 17.8 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, మునుపటి వారంలోని 2,85,000 డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదలని మొబైల్ యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సర్ టవర్ తెలిపింది.
ఇక సిగ్నల్ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కూ భారీగా డిమాండ్ పెరిగింది. 5వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య 15.7 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదైనట్లు తెలుస్తోంది. అంతకుముందు వారం 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇక వివాదానికి కేంద్ర బిందువైన వాట్సాప్‌కు అంతకు ముందువారం 12.7 మిలియన్ల డౌన్‌లోడ్లు ఉండగా జనవరి 5-12 మధ్య 10.6 మిలియన్లకు తగ్గాయి. ఇదంతా చూస్తుంటే సంప్రదాయ సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తుత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి