
తాజాగా శుక్రవారం ఒక్కరోజే బిట్ కాయిన్ విలువ 4.9 శాతం మేర కుంగింది. దాని విలువ ఇప్పుడు 41వేల 8 డాలర్ల వద్దకు చేరింది. గతేడాది నవంబరులో నమోదైన 69వేల డాలర్ల జీవితకాల గరిష్ఠంతో పోలిస్తే ఇది 40 శాతం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్క బిట్ కాయిన్ మాత్రమే కాదు.. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఈథర్ విలువ కూడా 9 శాతం పడిపోయింది. మరికొన్ని క్రిప్టో కరెన్సీలదీ అదే బాట.
బైనాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్ఆర్పీ వంటి కరెన్సీలు సైతం వారం రోజుల్లో తమ విలువలో 10 శాతం వరకూ కోల్పోయాయి. ఇలా క్రిప్టో కరెన్సీలు నేల చూపులు చూడటానికి కారణాలు లేకపోలేదు.. ఫెడ్ నిర్ణయాలు, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు క్రిప్టో కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే అధికంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ విషయం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వెల్లడైంది.
ఈ వార్త బయటకు రావడంతోనే క్రిప్టో కరెన్సీల పతనం ప్రారంభమైంది. ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువలు పడిపోతూ వస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన బిట్‌కాయిన్ జీవిత కాల గరిష్ఠం నుంచి ఇప్పుడు 40 శాతం కిందకు వచ్చింది. అయితే.. ఈ క్రిప్టో కరెన్సీకి కొన్నాళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అంతే కాదు.. ద్రవ్యోల్బణ నుంచి రక్షణ ఉండటం, పోర్ట్‌ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడంతో వీటి బూమ్ మొన్నటి వరకూ బాగానే ఉండేది. కానీ ఇప్పుడు అంతా తలకిందులవుతోంది.