బంగారం ధర మళ్లీ భారీగా పెరగబోతోందా.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50 వేల రూపాయలకు పైగానే ఉంది. మరి అలాంటి బంగారం ధర త్వరలోనే అంటే కొన్ని నెలల్లోనే రూ. 55 వేలకు చేరబోతోందా.. ఇది నిజమేనా.. అంతగా బంగారం ధర పెరిగేందుకు దారి తీసే పరిస్థితులేంటి.. మరి ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు ఏం జేయాలి.. ఇప్పుడే కొనేయడం మంచిదా.. మరికొన్ని రోజులు ఆగడం మంచిదా.. ఈ వివరాలు తెలుసుకుందాం.


ప్రస్తుతం బంగారం ధర మార్కెట్లో పది గ్రామాలు 50 వేల రేంజ్ దాటిపోయింది. సరిగ్గా చెప్పాలంటే.. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి బంగారం ధర 50 వేలుగా ఉంది. అదే సమయంలో వెండి ధరలు కూడా బాగా పెరిగాయి.. ప్రస్తుతం కిలో వెండి ధర 64 వేల రూపాయల వరకూ వెళ్లింది. ఇదే ఎక్కువ అనుకుంటే ముందు ముందు ఇంకా బంగారం, వెండి ధరలు పెరుగుతాయట.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి బంగారం ధర పది గ్రాములు రూ. 55 వేలు దాటటం ఖాయం అంటున్నారు నిపుణులు..


మరి అంతగా బంగారం ఎందుకు పెరుగుతుందంటే.. దానికి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా చెబుతున్నారు. ఈ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 1,900 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి 24 డాలర్లకు పెరిగిపోయింది. ఇదే ర్యాలీ ముందు ముందు కూడా కొనసాగుతుందని బులియన్‌ నిపుణులు చెబుతున్నారు. కేవలం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మాత్రమే కాదు.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ కూడా పడిపోయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుతోంది..


ఇలా అనేక కారణాలు బంగారం, వెండి ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. బంగారానికి రష్యా యుద్ధానికి లింకేమిటబ్బా అని మీరు అడగొచ్చు.. ఆ లింకు కూడా ఉంది.. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యానే మూడో అతి పెద్ద దేశం మరి. అలాంటి రష్యా  ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే సీన్ ఒక్కసారిగా మారుతుంది. రష్యాపై అమెరికా, నాటో వాణిజ్య ఆంక్షలు విధిస్తాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ సప్లయి పడిపోవచ్చు. మరి సప్లయ్‌ తగ్గితే డిమాండ్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది కదా.. అదీ లాజిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: