
ఇటీవల ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. నేటి ఆధునిక సమాజంలో కూడా కొంతమంది ఇంకా కులం, మతం అని పట్టుకొని పాకులాడుతూనే ఉన్నారు. వెరసి ఇక పరువు పోతుంది అనే కారణంతో ఏకంగా మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా యువతీని ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడుని దారుణంగా హత్య చేశారు. క్రిష్ణగిరి జిల్లా కిట్టం బట్టి గ్రామానికి చెందిన 28 ఏళ్ల జగన్ స్థానికంగా టైల్స్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. క్రిష్ణగిరి జిల్లా అవదాన పట్టి సమీపంలో తులక్కన్ కోటాయి ప్రాంతానికి చెందిన శరణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు కూడా పెద్దల అనుమతి లేకుండానే ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి తరపు బంధువులు ఎలాగైనా జగన్ ను చంపేయాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే జగన్ టైల్స్ పని నిమిత్తం కిట్టం బట్టి నుంచి కావేరి పట్నంకు బైక్ పై వెళ్తుండగా శరణ్య అన్నయ్య శంకర్ ఇతర బంధువులు రోడ్డు మార్గమధ్యంలో జగన్ ను ఆపి దాడికి దిగారు. కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జగన్ ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.