గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే... ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా చతికిలపడి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక నోట్ల రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ కేవలం ఒక సీటుకే పరిమితం కావటం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసిన  కొద్దికాలానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తమకు నమ్మకం పోయిందని అలాగే వైసీపీ ప్రభుత్వ పథకాలు, విధానాలు నచ్చాయని చెబుతూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్‌కి జై కొట్టటం రాష్ట్రంలో తీవ్రంగా చర్చనీయాంశం అయింది. వీరిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అలాగే విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ బహిరంగంగానే జగన్‌కు మద్దతు తెలిపినవారిలో ఉన్నారు .



అయితే జగన్ తన వైసీపీ పార్టీలోకి వచ్చేవారు ఖచ్చితంగా వారి ప్రస్తుత పదవికి రాజీనామా చేయాలనే నిబంధన పెట్టటం వారికి అడ్డంకిగా మారింది. దీనితో పార్టీ కండువా కప్పుకోకుండా బయటి నుంచే మద్దతు తెలుపుతున్నారు సదరు వర్గపు ప్రజా ప్రతినిధులు. ఇక ఇటీవలే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కూడా జగన్‌కి‌ మద్దతిచ్చారు. తన కొడుకు కరణం వెంకటేష్‌ ని వైసీపీలో చేర్పించారు. ఇక అలాగే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు సైతం ఫ్యాన్‌ పంచన చేరిపోవటం విశేషం. ఇక ఇటీవలే అదే వరుసలో అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీలో చేరారు. ఆమె పార్టీలో చేరడంతోనే టీడీపీ హయాంలో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక ఆమె రాజీనామా చేసిన స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం జగన్.. తిరిగి ఆమెకే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఈ ఎన్నికలో పోతుల సునీత మళ్లీ ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నికయ్యారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికలో సునీత ఒక్కరే వైసీపీ నుండి నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి ధువ్రీకరణ పత్రాన్ని పోతుల సునీతకు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: