అప్పటివరకూ కళ్లముందే ఆడుకున్న చిన్నారి కూతురు అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయింది.. అమ్మ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే ఆ చిన్నారి గొంతు మూగబోయింది.. గలగలా వినిపించే ఆ చిన్నారి పట్టీల సవ్వడి ఇక వినిపించదు అన్న విషయం  తల్లిదండ్రుల గుండె పగిలేలా చేసింది.. కనీసం రెండేళ్లు కూడా నిండకముందే ఆ చిన్నారికి నిండు నూరేళ్ళు నిండిపోయాయి. సంతోషంగా ఆడుకుంటున్నా ఆ చిన్నారి నవ్వును చూసి ఓర్వలేక విధి పోయింది. విధి ఆడిన వింత నాటకం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. నీటి బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందడం ఆ తల్లిదండ్రుల గుండె పగిలేలా చేసింది.




 ఈ విషాదకర ఘటన స్థానికంగా అందరినీ కంటనీరు తెప్పించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు ఆడుకుంటుంది కదా అని తల్లి తన పనిలో నిమగ్నమై ఉంది. కానీ తల్లి చిన్నపాటి నిర్లక్ష్యమే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురుని దూరం చేసింది. నీటి బకెట్ వద్దకు వెళ్లిన ఆ చిన్నారి అందులో అందులో జారి పడింది. ఇక ఎవరు గమనించక పోవడంతో చివరికి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. శ్రీనివాస్, సోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.


 అయితే ఇటీవలే శ్రీనివాస్  కుమారుడిని తీసుకొని దుకాణం వద్దకు వెళ్లగా.. సోనీ కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే 18 నెలల కుమార్తె ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. తల్లి తన పనిలో నిమగ్నమైంది. కాసేపటికి కూతురు అలికిడి లేక పోవడంతో కంగారుపడిన తల్లి ఏం జరిగిందని ఇల్లంతా వెతికింది. ఈ క్రమంలోనే స్నానాల గదిలోకి వెళ్లి చూసింది. ఇంతలో ఇక 18 నెలల కూతురు నీటి బకెట్లో తలకిందులుగా పడి ఉంది. దీంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. వెంటనే కూతురిని రెండు చేతుల్లో పట్టుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అక్కడినుంచి ఆంబులెన్స్ లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: