ప్రస్తుతం సమాజంలో చిన్న విషయానికి కూడా గన్ తో ఫైరింగ్ చేయడం అలవాటు అయ్యింది. గన్ తో ఫైరింగ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం పట్టణంలోని పాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని రామచంద్రపురం సర్పంచ్ గోలివి వెంకట రమణమూర్తికి చెందిన కార్యాలయంలోనే అతడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. ఇక అద్ళష్టవశాత్తు స్పల్ప గాయాలతో సర్పంచ్ వెంకటరమణ ప్రాణాలను కాపాడుకున్నారు.

అయితే వెంకటరమణ మూర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మధురా నగర్ లోని సర్పంచ్ వెంకట రమణమూర్తికి చెందిన కార్యాలయానికి ఆదివారం పేటకు చెందిన షాలిని అనే మహిళ కూడా వచ్చింది. ఆమెతోపాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు ఆ మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకొచ్చింది. వారంతా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మహిళతో సహా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెంకటరమణ మూర్తిపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పులలో వెంకట రమణ మూర్తి అక్కడే కిందపడిపోగా.. షాలిని అనే మహిళ సహా ఇద్దరు నిందితులు అక్కడినుండి పరారైనట్లు తెలుస్తోంది. వెంకట రమణ మూర్తి స్వల్ప గాయాలతో తప్పించుకున్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు  చేపట్టారు. అయితే ఈ దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. సర్పంచ్ కు, ఘటనా స్ధలంలో ఉన్న మహిళకు మధ్య ఉన్న అక్రమ సంబంధం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాత గొడవలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు దొరికినట్లు తెలిపారు. అంతేకాదు.. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించి ల్యాబ్ కి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: