
ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాఖపట్నం దగ్గర ఆనందపురం నుంచి నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చిన ఒక జంట యూసుఫ్‌గూడలో కాపురం ఉంటోంది. ఇద్దరూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ జీవితం వెళ్లదీస్తున్నారు. అయితే ఊహించని విధంగా వీరి జీవితంలోకి సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్ ఎంట్రీ ఇచ్చాడు. విశాఖపట్నం దగ్గర్లోని వాడే కావడంతో ఈ జంటతో సూర్యనారాయణకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చనువుగా మారింది.
అయితే కొన్ని రోజుల క్రితం సూర్యనారాయణ నేరుగా ఆ జంట ఇంటికే వెళ్లాడు. తన ఇంట్లో భార్య, పిల్లలు తనను పట్టించుకోవడం లేదని బాధపడ్డాడు. ఇక్కడే అతను అసలు విషయం చెప్పేశాడు. ఆ జంటలోని భార్యపై మనసు పారేసుకున్న సూర్యనారాయణ.. ఆమె భర్త ముందే తన లవ్ ప్రపోజల్ పెట్టేశాడు.
"మీ ఆవిడ అంటే నాకు ప్రాణం.. ఆమె లేకపోతే నేను ఉండలేను. మీ ఆవిడని నాకు ఇచ్చేయ్.. నాతో పంపించు.. జీవితాంతం రాణిలా చూసుకుంటా" అంటూ బాంబ్ పేల్చాడు. డైలాగ్ విన్న భర్తకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. "ఏంటి నీకు మతి పోయిందా? నా భార్యను ఇవ్వమని నన్నే అడుగుతావా?" అంటూ నిప్పులు చెరిగాడు. ఆగ్రహంతో ఊగిపోతూ సూర్యనారాయణను ఇంటి నుంచి గెంటేశాడు.
అక్కడ అవమానం జరగడంతో సూర్యనారాయణ అక్కడే ఇంటి బయటే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్ దగ్గర పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పెట్రోల్ కొనుక్కుని నేరుగా ఆ జంట ఇంటికి వెళ్లాడు. క్షణం ఆలస్యం చేయకుండా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే స్పందించి పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సూర్యనారాయణను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చికిత్స పొందుతూ సూర్యనారాయణ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రేమ కథ విషాదంతో ముగిసింది.