ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఖైదీకి వినూత్న రీతిలో మరణ శిక్ష అమలుకు అమెరికా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ను ఉపయోగించి ఓ దోషికి మరణ శిక్ష అమలు చేసింది. అయితే తీవ్రమైన నేరాలు చేసిన వారికి కోర్టులు మరణ శిక్షలు విధిస్తుంటాయి.  కొన్ని దేశాల్లో ఉరి శిక్షను అమలు చేస్తే మరొకొన్ని దేశాల్లో కాల్చి చంపుతుంటారు. తాజాగా అమెరికాలో అమలు చేసింది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.


హత్య కేసులో దోషిగా తేలిన కెన్నత్ యూజీన్ స్మిత్(58) పై అమెరికా లోని అలబామా రాష్ట్రంలో దీనిని ప్రయోగించారు. దీంతో 1982లో విషతుల్య ఇంజక్షన్ విధానాన్ని తెచ్చాక తొలిసారిగా అమెరికాలో మరో కొత్త మరణ శిక్ష ప్రక్రియ వినియోగంలోకి వచ్చినట్లయింది. ఈ  చర్యను ఐరాపా సంఘం, ఐరాస మానవహక్కుల కార్యాలయం తప్పుపట్టాయి. ఐతే మానవీయ పద్ధతుల్లోనే శిక్షను అమలు చేశామని అమెరికా అధికారులు  స్పష్టం చేశారు.


స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి సుమారు 7గంటల సమయంలో అట్మోర్ లోని హోల్మన్ కరెక్షనల్ ఫెసిలిటీలోని మరణ శిక్ష గదిలోకి స్మిత్ ను అధికారులు తీసుకువచ్చారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి హతురాలి కుటుంబ సభ్యులతో పాటు స్మిత్  సంబంధీకులు అతని ఆధ్యాత్మిక సలహాదారు, లాయరు వచ్చారు.  ఐదుగురు మీడియా ప్రతినిధులను పిలిచారు.


స్మిత్ ను తొలుత ప్రత్యేక బెడ్ పై పడుకోబెట్టారు. కాళ్లు చేతులు కట్టేశారు. 7.53 గంటలకు మరణ శిక్ష ప్రక్రియ మొదలైంది. ప్రేమ శాంతి, కాంతితో నేనే నిష్ర్కమిస్తున్నా.. ఐ లవ్ యూ అంటూ స్మిత్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత స్మిత్ కు అధికారులు మాస్కును బిగించారు. దాని నుంచి నైట్రోజన్ గ్యాస్ ను పంపించారు. ఆసమయంలో అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యులను చూస్తూ  చిరునవ్వు చిందించారు. క్రమంగా ఆక్సిజన్ అందని పరిస్థితి తలెత్తింది. నైట్రోజన్ ఇవ్వడం మొదలయ్యాక కొద్ది సేపు స్పృహలో ఉండి ఆ తర్వాత మూర్చ వచ్చినట్లు రెండు నిమిషాలు కాళ్లు చేతులు ఆడించి మృతి చెందారు. నైట్రోజన్ గ్యాస్  ను దాదాపు 15 నిమిషాలు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: