వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్‌ విజయమ్మ ఇటీవల తప్పుకున్నారు. వైసీపీ ప్లీనరీలోనే ఆ విషయాన్ని తన ప్రసంగంలో ప్రకటించారు. తన మరో బిడ్డ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు అండగా నిలిచేందుకే వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అఫీషియల్‌ గా చూస్తే ఇక్కడ వివాదం ఏమీ లేదు.. అయితే.. వైఎస్ జగన్‌ కుటుంబంలో షర్మిల, విజయమ్మ మరియు జగన్, భారతి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రత్యేకించి ఓ టీడీపీ అనుకూల మీడియా కొన్నాళ్లుగా ప్రచారం చేస్తూ వస్తోంది.


వైఎస్‌ జగన్ తన చెల్లెలు షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని.. వైసీపీలో పదవి ఇవ్వలేదని.. అందుకే.. ఆమె తెలంగాణకు వెళ్లి పార్టీ పెట్టుకున్నారని.. ఇప్పుడు వైఎస్ జగన్ తల్లిని కూడా గెంటేస్తున్నారని ఆ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే పాట పాడుతున్నారు. అమ్మను గెంటేసిన జగన్‌రెడ్డి ప్రజలకేమి చేస్తాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కామెంట్ చేస్తున్నారు. జగన్ రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత అంటూ విమర్శిస్తున్నారు. అమ్మని గెంటేసిన వాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, స్కూల్ పిల్లలకు ఏం చేస్తారని చంద్రబాబు దుయ్యబట్టారు.


అయితే.. ఇక్కడ విజయమ్మ కానీ, షర్మిల కానీ.. ఇంకొకరు కానీ.. తమకు జగన్ అన్యాయం చేశాడని మీడియా ముందు కానీ.. ఇంటర్వ్యూల్లో కానీ.. రాతపూర్వకంగా కానీ ఎక్కడా చెప్పలేదు. ఇదంతా మీడియాలో జరుగుతున్న ఊహాగానమే.. అలాగని అక్కడ ఏమీ లేదని చెప్పలేం.. కానీ.. ఏదైనా ఉండే అవకాశం ఎంత ఉందో.. లేకపోయే అవకాశం కూడా అంతే ఉంది. కానీ ఇప్పుడు జగన్ పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తే.. వాడుకుని వదిలేయడం అనే విషయంలో చంద్రబాబుకు ఉన్న రికార్డును బీట్ చేయడం ఎవరి తరం కాదని చెబుతున్నారు వైసీపీ నేతలు.


సాక్షాత్తూ చంద్రబాబుకు పిల్లనిచ్చిన మామ.. పార్టీలోకి అవకాశమిచ్చి ఆదుకున్న మామ ఎన్టీఆరే.. చంద్రబాబు తనను ఎలా నమ్మకద్రోహం చేశాడో.. డైరెక్టుగా మీడియా ముందు చెప్పిన రికార్డులు ఉన్నాయి. జామాత దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ క్షోభించిన వీడియోలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి కానీ.. బావమరిది హరికృష్ణ కానీ.. చంద్రబాబు ఎలా వాడుకుని వదిలేశారో అనేకసార్లు మీడియా ముందు చెప్పారు. పాపం.. చంద్రబాబు ఆ ఫ్లాష్‌ బ్యాక్ మర్చిపోయినట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: