తాజాగా సుప్రీంకోర్టు మోడీ సర్కార్ కి మొట్టికాయ వేసిందని తెలుస్తుంది. విమర్శనాత్మకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. మలయాళ వార్తా ఛానల్ మీడియా వన్ కి భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేయడానికి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. జాతీయ భద్రతకు ముప్పు అనే కబుర్లు చెప్పొద్దంటూ దుయ్యబట్టారు.


ప్రజా హక్కులను నిరాకరించడానికి కారణంగా దేశ భద్రతను చూపించకూడదని జస్టిస్ డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా నిర్లక్ష్యం చూపిందని కోర్ట్ తెలిపింది‌. పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను రాజ్యం విధించకూడదని, దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని, కఠోర వాస్తవాలను మాట్లాడటం, ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యం అని చెప్పింది.


ప్రభుత్వ విధానాలపై మీడియా వన్ ఛానల్ విమర్శనాత్మక అభిప్రాయాలు ఉండడం ప్రభుత్వ వ్యతిరేకతగా అభివర్ణించకూడదని, అటువంటి పదప్రయోగాలు చేయడంలోనే పత్రికా రంగం తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే భావం వ్యక్తం అవుతుందని చెప్పింది. మీడియా వన్  టీవీ ఛానల్ ఢిల్లీ హింసకాండని ప్రసారం చేయడంపై కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ 2020లో అభ్యంతర వ్యక్తం చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్ రూల్స్ 1994 నిబంధనల ఉల్లంఘనకు 48 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలను నిషేధించింది.


2022లో ఆ ఛానల్ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోవడంతో ఆ చానల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాలను చూపించింది. అయితే అందుకు తగిన వివరాలు వెల్లడించలేదు. ఆ ఛానల్ పెట్టుబడిదారులలో అత్యధికులు కేరళ చాప్టర్ జమాతే ఇస్లాం కి చెందిన వారని దాన్ని నిషేధించడానికి అది  కారణం కావచ్చని వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు గత ఏడాది ఛానల్ కార్యకలాపాలను పునరుద్ధరించమని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ ఛానల్ మీద నిషేధాన్ని కేంద్రం రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: