దేశంలో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు వస్తున్న దేశంగా ఇప్పుడు భారత్ మారింది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి గడించిన ఇండియా ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. ప్రపంచ దేశాలన్నీ మనపై సానుభూతి చూపిస్తున్న దైన్యస్థితి. అయితే ఈ పరిస్థితికి కేంద్రం అనుసరించిన లోప భూయిష్టమైన విధానాలే కారణమన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వ్యవస్థలు విఫలమైనప్పుడు మానవత్వం మేలుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విఫలమైందని.. ఇక ప్రజలే కరోనా కట్టడికి నడుంబిగించాలని ట్విట్టర్‌లో పిలుపు ఇచ్చారు. అంతే కాదు.. దేశంలోని కాంగ్రెస్‌ నాయకులంతా రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా పక్కకు పెట్టి కరోనా కట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.  
 
ఇలాంటి కష్టకాలంలో దేశానికి బాధ్యతాయుతమైన పౌరుల అవసరం ఎంతో ఉందన్నారు రాహుల్ గాంధీ. అందుకే కాంగ్రెస్ నాయకులంతా కరోనా బాధితులకు సహాయం అందించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కుటుంబ ధర్మం ఇదే అంటున్నారు రాహుల్ గాంధీ. కీలకమైన సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ పిలుపు చాలా ముఖ్యమైందిగానే చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. దేశంలోనే ప్రధాన పార్టీల్లో ఒకటి.  ఆ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం అంతా ఇంతా కాదు.. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి యంత్రాంగం ఉంది. కాంగ్రెస్ పార్టీయే కాదు.. బీజేపీ కూడా అలాంటి జాతీయ పార్టీయే.. ఇలాంటి కష్ట కాలంలో పార్టీలన్నీ రాజకీయాలు వదిలేసి కరోనాపై పోరాటంలో భాగస్వాములు కావడం ఎంతో అవసరం. రాహుల్ ఇచ్చిన పిలుపు అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. మరి పార్టీలు రాహుల్ గాంధీ మాట వింటాయా.. చూడాలి మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: