ప్రపంచమంతా పరిస్థితి ఇలా ఉంటే.. పాక్, చైనా మాత్రం తాలిబన్లకు స్నేహ హస్తం చాస్తూ తమ బుద్ధి బయటపెట్టుకున్నాయి. అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతుంటే.. ఈ రెండు దేశాలు మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నాయి. అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభాన్ని వివిధ దేశాలు ఖండిస్తుంటే... చైనా, పాకిస్థాన్ మాత్రం తాలిబన్లతో కలసి పనిచేస్తామని.. చెబుతున్నాయి. అంతే కాదు... తాలిబన్ల ఆక్రమణను చైనా, పాకిస్థాన్ మాత్రం సమర్థిస్తున్నాయి.
తాలిబన్ల ఆక్రమణతోనే అఫ్గాన్‌కు స్వేచ్ఛ లభించిందని పాక్ చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆకాశానికెత్తేశారు.. తాలిబన్లపై ప్రశంసలు కురిపించారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడం ఆ దేశ బానిసత్వ సంకెళ్లను తెంచడమేనంటూ కొత్త బాష్యం చెప్పారు. మొదటి నుంచి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.. కానీ అదేదో కాస్త రహస్యంగా జరిగేది.. ఇప్పుడు ఇమ్రాన్ మాటలతో అంతా ఓపెన్ అయిపోయింది.
ఇక చైనాదీ అదే దారి.. అఫ్గాన్ పరిస్థితులపై తాజాగా స్పందించిన చైనా తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటామంటోంది. అందుకు చైనా సిద్ధమేనని ప్రకటించింది. అఫ్గాన్ ప్రజల అభీష్టాలను గౌరవిస్తామంటోంది. ప్రజల రక్షణ బాధ్యత తీసుకుంటూ విదేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించినట్లు చైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి