ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదా.. ఉక్రెయిన్‌ ఇంకా తన పోరు కొనసాగుస్తుందా.. ఓవైపు నగరాలకు నగరాలే శిథిలం అవుతున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారు. రష్యా వంటి దిగ్జజ దేశంతో తలపడలేనని తెలిసినా ఎందుకు యుద్ధం కొనసాగిస్తున్నారు. అసలు ఉక్రెయిన్ వెనుక ఉండి.. అమెరికానే యుద్ధం సాగిస్తోందా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం అవుననే వస్తోంది.


ఉక్రెయిన్‌ను వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం మరింత పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఈ సాయాన్ని మరింత సులభతరం చేసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం తాజాగా చేశారు. వాస్తవానికి ఇది కొత్త బిల్లు కాదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా గతంలో ఉపయోగించిన లెండ్‌ అండ్‌ లీజ్‌ ప్రక్రియను బైడెన్ మరోసారి బయటకు తెచ్చారు.


ఎలాంటి ఆలస్యం లేకుండా ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించటానికి బైడెన్ ఈ ఎత్తు వేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం అందించటానికి ఈ బిల్లు కీలకం అంటున్నారు బైడెన్.  రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ ప్రజలు తమ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఈ బిల్లు ముఖ్యమైన ఆయుధం అంటున్నారు.. ఈ బిల్లు ద్వారా రష్యాతో ఉక్రెయిన్‌ పోరాడేందుకు 40బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని అమెరికా రెడీ చేసింది.


రష్యాపై ఉక్రెయిన్‌ విజయం సాధించటానికి ఈ  ప్యాకేజీ కీలకమని అమెరికా భావిస్తోంది. అయితే.. ఈ మిలిటరీ సాయంలో ఆటంకం లేకుండా ఉండాలంటే అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం అవసరం. అందుకే వీలైనంత త్వరగా ఈ ప్యాకేజీని కాంగ్రెస్‌ ఆమోదించాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.  రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సాధించిన విజయానికి సంకేతంగా ఈనెల 9వ రష్యా జరుపుకొన్న విక్టరీ డే రోజే బెడెన్ ఈ బిల్లుపై సంతకం చేయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: