దేశంలో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలోనే ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. ఇప్పుడు దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ అంతర్మథనంలో పడింది. తన లోటు పాట్లను అంచనా వేసుకుంటోంది. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన శింతన్ శివిర్‌లో ఇదే అంశాలపై కూలంకషంగా చర్చించింది. అనేక వర్గాలను ఆకట్టుకుని మళ్లీ పునర్‌ వైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది.


అందుకే పార్టీలోని అన్ని స్థాయిల పదవుల్లో... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50శాతం చోటు కల్పించాలని ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ నిర్ణయించింది. పార్టీలో యువ రక్తం నింపేందుకు 50శాతం పదవులను 50ఏళ్లలోపు వారికి అప్పగించాలని కూడా నిర్ణయించింది. ఈవీఎంలపై... రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ అధికారంలోకి వస్తే.. ఈవీఎంలకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించింది.


ఎప్పుడో ఇలాంటి శిబిరాలు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా తరచూ రాజకీయ అంశాలపై సమావేశమై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సభ్యులతో ఓ సలహా గ్రూప్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 2024 లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా పావులు కదిపింది. అలాగే పార్టీలో అవసరమైన సంస్కరణల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజలతో మమేకమయ్యేందుకు అక్టోబర్‌ 2న కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర నిర్వహించనున్నారు.


అలాగే జూన్‌ 15న జనజాగరణ్‌ రెండో విడత యాత్రను ప్రారంభించనున్నారు. ఇక ఆగష్టు 15 నుంచి 'ఉపాధి దో' అంటూ దేశ వ్యాప్త పాదయాత్రను చేయబోతున్నారు. ఇలాంటి వ్యూహాలతో  ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను అధిగమించగలమని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీలో 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడంపై చింతన్‌ శివిర్‌లో చర్చ జరిగినా  ఏకాభిప్రాయం కుదరక ఆ నిర్ణయం ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: