
సొంత జిల్లాలో ప్రజల కోసం ఒక్క బ్రిడ్జి నిర్మించలేని అసమర్థుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేశ్. ఎన్నికల సమయంలో రాయలసీమ బిడ్డనని చెప్పుకొని ఓట్లు దండుకోవడంపై జగన్కు ఉన్న శ్రద్ధ.. జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని నారా లోకేశ్ విమర్శిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక సిద్దవటం మండల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మాచుపల్లి-ఖాదర్ బంగ్లా నడుమ బ్రిడ్జి నిర్మించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
కడప జిల్లాలో దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని.. తనను కలసిన సిద్ధవటం మండల ప్రజలతో నారా లోకేశ్ అన్నారు. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల ప్రజలు.. లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1986 జూలై 6న సిద్ధవటం మండలం మాచుపల్లి-ఖాదర్ బంగ్లా మధ్య పెన్నా నదిపై వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని లోకేశ్ గుర్తు చేశారు. 36 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా, తర్వాత పనులు ముందుకు సాగలేదని.. పెన్నానది ప్రవాహానికి పిల్లర్లు కొట్టుకుపోయాయని.. నారా లోకేశ్ అన్నారు.
అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా దీని గురించి పట్టించుకోవడం లేదన్న నారా లోకేశ్..ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు మండలంలోని 10గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. దీని ద్వారా 12 నుండి 32కిలోమీటర్లు చుట్టూ తిరిగొచ్చే సమస్య తప్పుతుందని.. తాము అధికారంలోకి వచ్చాక ఈ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ చెప్పారు.