ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై విశేషంగా ప్రభావం చూపాయి. అక్కడ అధికార పక్షానికి షాక్ తగలడంతో ఏపీలో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెస్తున్నారు.  అందులో భాగంగా తొలి దశలో 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జిలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


అయితే ఈ మార్పులు చేసిన స్థానాల్లో సామాజిక సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  తన సామాజిక వర్గమైన రెడ్లను పక్కన పెట్టి బీసీలను అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో పాటు రిజర్వ్ డు స్థానాలైన ఎస్సీ , ఎస్టీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో నింపేలా సన్నాహాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా చిలకలూరిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీని గుంటూరు వెస్ట్ కి మార్చారు. రాజేశ్ నాయుడిని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించారు.


మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్థానాన్ని కూడా మార్చారు. ఆమెను ప్రత్తి పాడు నుంచి తాడికొండకు ఇన్ఛార్జిగా నియమించారు. ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు.  మంత్రి ఆదిమూలపు సురేశ్ ను కొండిపికి, వేమూరుకు అశోక్ బాబుని నియమించారు. సంతనూతల పాడు కి మెరుగు నాగార్జున, రేపల్లెకు ఈవురు గణేశ్, అద్దంకి కి పాణం హనిమిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.


మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ను వారించకుండా వెంటనే బీసీ  సామాజిక వర్గ నేత అయిన గంజి శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. గాజువాకలో బలమైన యాదవ వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావుకు,  రేపల్లెలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఏపూరి గణేశ్ కి,  చిలకలూరిపేటలో బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. అందుకే ఆ సామాజిక వర్గ నేతను అక్కడ నియమించారు. మొత్తం మీద సోషల్ ఇంజినీరింగ్ ను జగన్ పాటిస్తున్నారు. ఇది నష్టమా, లాభమా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: