
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొదట్నుంచి ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తూనే వస్తోంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు అనుకూలంగా వచ్చినా డివిజన్ బెంచ్ లో ప్రతికూల తీర్పు వచ్చింది. చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. టైం అంటూ ఏమీ లేదని పేర్కొంది.
దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గతంలోనే మరో ముగ్గురిపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తోంది. ఈ నెల 10న ఈ రెండు పిటిషన్లు కలిపి విచారించనుంది. ఈలోగా ఎమ్మెల్యేల వివరణ తీసుకోవాలని భావించి నోటీసులు జారీచేసింది. మరోవైపు సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా ఎమ్మెల్యేల వివరణ కోరుతూ నోటీసులిచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టు నోటీసులతో తదుపరి నిర్ణయం తీసుకోడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకచోట సమావేశం అయ్యారు. పార్టీ మారిన వారిలో మాజీ మంత్రులు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కాలె యాదయ్య, మహిపాల్ రెడ్డి ,అరికెపూడి గాంధీ, బండ్ల క్రిష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఉన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తమ న్యాయపోరాటానికి తిరుగులేని ఆధారాలు లభించాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.