టీడీపీలో నెలకొన్న అంతర్గత వివాదాలకు అంతు కనిపించడంలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో పార్టీ నాయకత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు వస్తుండటంతో, వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జరిగిన సమీక్షల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలపై నిఘా మరియు నియంత్రణ బాధ్యతను మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించారు. అయితే ఇది కార్యరూపం దాల్చే అవకాశాలే ఉన్నాయా అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. అసలు సమస్య ఏమిటంటే… ఇన్‌చార్జ్ మంత్రుల మాట కూడా చాలా మంది ఎమ్మెల్యేలు లెక్క చేయ‌డం లేదు. మంత్రులు నియోజకవర్గ పర్యటనలకు వస్తున్నారంటేనే ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం, అందుబాటులోకి రాకపోవడం పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో నియోజకవర్గంలోనే ఉన్నా ఆరోగ్య కారణాలు వంటి చిన్న చిన్న కారణాలు చూపించి సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది.


ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలపై నిబంధనలు అమలు చేయడానికి ఇన్‌చార్జ్ మంత్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని వారు ఇటీవల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. “ మేము ప్రయత్నిస్తున్నాం… కానీ వారు మాట వినటం లేదు ” అని మంత్రులు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనిపై లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. ఎమ్మెల్యేల‌ను గాడిలో పెట్టాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేసిన ఆయన, సమస్య సృష్టిస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాలను రహస్యంగా తన డ్యాష్‌బోర్డ్‌కు పంపాలని సూచించారు. “ వారి విషయంలో నేను చూసుకుంటా ” అని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎవరు ఏ విషయంలో మాట వినడం లేదో, ఎక్కడ వ్యవస్థ దారి తప్పుతోందో స్పష్టమైన పాయింట్ల వారీగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించాలని సూచించారు.


మరీ ఇదొక్కటే కాదు… మంత్రులు పర్యవేక్షిస్తున్న తీరు కూడా తమకు స్పష్టంగా తెలియాలని లోకేష్ చెప్పారు. “మీరు ఏర్పాటు చేసే సమావేశానికి సంబంధించిన అజెండా, ఆహ్వానించిన నాయకులు ఎవరు, ఎవరెవరు రాలేదు, ఎందుకు రాలేదని స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సూచనలతో ఇప్పటివరకు సూత్రం లేకుండా సాగిన వ్యవస్థకు ఒక రూపురేఖ దొరికినట్టుగా మంత్రులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఎంతవరకు పనిచేస్తుందో, ఇన్‌చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిజంగా దారిలోకి వస్తారో లేదో చూడాలి. పార్టీ అంతర్గత క్రమశిక్షణను పటిష్టం చేయడానికి ఇది కీలక దశగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: