ఏపీ రాజకీయాల్లో ఇటీవ‌ల కాలంలో ఒక స్పష్టమైన వాస్తవం కనిపిస్తోంది. ప్రతిపక్షంలో పెద్ద‌ గ్యాప్. ఇది కేవలం పార్టీ కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమితం కావ‌డం వ‌ల్ల వ‌చ్చింది అయితే కాదు. ప్ర‌జ‌ల‌తో కనెక్షన్ కోల్పోయిన ప్రతిపక్షం వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్య‌త అని చెప్పాలి. ఎన్నికల తర్వాత వైసీపీ అసెంబ్లీలో సంఖ్యా బలం ఉన్నా, ప్రజల మద్ధతు , ప్రజా చర్చల్లో ప్రాధాన్యత మాత్రం తగ్గింది. దీంతో రాష్ట్రంలో ప్రత్యక్ష ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వ అడుగులు సాఫీగా సాగుతున్నాయి. ఈ విష‌యాన్ని సీఎం చంద్రబాబు కూడా ఇటీవల బహిరంగంగా అంగీకరించడం గమనార్హం. “ ప్రతిపక్షం ఉన్నా బలహీనంగా ఉంది… అందువల్ల మనమే విమర్శకుడి పాత్ర కూడా పోషించాలి ” అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. పార్టీ నేతలకు ఆయన చెప్పిన “ప్రశ్నించేవారు లేరని మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకండి… ప్రజలు చూస్తున్నారు” అన్న మాటలు కూడా ప్రతిపక్షం లోపాన్ని పార్టీ అంతర్గత వ్యవహారాలకు సైతం ఆయ‌న విడ‌మ‌ర్చి చెప్పిన‌ట్టు క్లీయ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది.


అంటే ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం అవసరమే కాక, పార్టీ నిత్యం అప్ర‌మ‌త్త‌త‌తో ఉండ‌డానికి ప్రతిపక్షం తప్పనిసరి అని ఆయన భావించారు. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీలో ప్ర‌తిప‌క్ష ప‌రంగా పోరాట‌ప‌టిమ కనిపించడం లేదు. కేవ‌లం 11 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉండ‌డం, పార్టీ ముఖ్య నేతలు మౌనంగా వ్యవహరించడం ఇవన్నీ వైసీపీని ప్రజలకు మరింత దూరం చేశాయి. రాజకీయాల నుంచి ఫైట్ మోడ్‌లో ఆ పార్టీ కనిపించకపోవడం ప్రజల్లో ప్రతిపక్షం శూన్యం మరింత పెంచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఉనికే కనిపించని పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం, కేడర్ ఏదీ ఆశించిన స్థాయికి రాలేదు.


పేరుకు క‌మ్యూనిస్టులు ఉన్నా, వారికి సామాజిక సమస్యలు, వాదాలకే పరిమిత‌మ‌వుతున్నారు. వారిలో మాస్ కనెక్టివ్ వేవ్ లేదు. అందువల్ల వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎవ్వరూ ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేకపోతున్నారు. ఈ లోపాన్ని పసిగట్టి ప్రభుత్వం పేపర్లు, మీడియా, సోషల్ డిబేట్స్‌లో వచ్చే ప్రతి విమర్శ, ఫిర్యాదును వేగంగా ఫాలోఅప్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే ప్రతిపక్షం లేకున్నా ప్రజా విమర్శలే ప్రతిపక్షం పాత్రను కొంతవరకూ భర్తీ చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఏదేమైనా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్షం లేని పాత్ర అయితే బ‌లంగా క‌నిపిస్తోంది. వైసీపీ త‌క్ష‌ణ‌మే పుంజుకుని ప్ర‌తిప‌క్ష పాత్ర స‌మ‌ర్థ‌వంతంగా పోషించ‌క‌పోతే ఆ పార్టీకి మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: