గ్రామీణ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైన పదినిమిషాల్లో వైద్యం అందించేందుకు సర్కారు ఏర్పాటు చేయబోతున్న ఈ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఇంటి ముంగిట్లోకి వైద్యాన్ని తీసుకువచ్చి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వీటిని ప్రత్యేక శ్రద్ధతో అందుబాటులోకి తీసుకురాబోతుంది. గతంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ద్వారా మంజూరైన హెల్త్ అండ్ వెల్ సెస్ సెంటర్ లను పల్లె దవాఖానాలు గా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,830 సెంటర్లను ఏర్పాటు చేయాలనుకోగా, తొలిదశలో 1677 కేంద్రాలను తీసుకువస్తున్నారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ గురువారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

అంతేకాక ఆయా సెంటర్లలో డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ పవర్, మౌలిక వసతులను కలెక్టర్లు సమకూర్చుకోవాలని సూచించారు. ఈనెల 28 న జిల్లాల వారీగా ఉన్న ఖాళీల  వివరాలతో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ లోగా డి ఎం హెచ్ వో లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ లను పంపవచ్చని స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి 34 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు మెడికల్ ఆఫీసర్ గా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ,బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ కు మూడేళ్లు వయసు సడలింపు ఇచ్చారు. పోస్టింగ్లు ఎక్కడ ఇచ్చినా చేసేందుకు సిద్ధపడి  ఉండాలి.

స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సబ్ సెంటర్లలో, అవుట్ పేషంట్ సేవలతో పాటు, మాతా శిశు సంరక్షణ, ఇమ్యునైజేషన్, బీపీ, షుగర్,ఇతర జ్వర పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సెంటర్లలో ప్రాథమిక పరీక్ష తర్వాత అవసరమైన వారికి ఇక్కడి నుంచే పెద్ద దవాఖానకు రిఫర్ చేయనున్నారు. దీంతో ప్రైవేట్,కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తప్ప నున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: