ఈ పెద్దోళ్లున్నారే.. మా చిన్నవాళ్ల మనసులను వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.. నువ్వు- నేను సినిమాలో హీరో ఉదయ్ కిరణ్‌ చెప్పిన ఈ డైలాగ్‌.. పిల్లలు, పెద్దల మధ్య తరతరాలుగా వస్తున్న ఈ ఘర్షణ వైఖరికి అద్దం పడుతుంది. చిన్న వాళ్లు ప్రేమ, ఆకర్షణ వంటి మాయలో పడిపోతారని.. ఆ మాటలో వాస్తవాలు అర్థం చేసుకోలేరని పెద్దలు అంటుంటారు.. అదేం కాదు.. మా ప్రేమలో నిజాయితీ ఉంది. మారుతున్న కాలంతో పాటు మారండి.. మా ప్రేమలను అర్థం చేసుకుని చేయూత ఇవ్వండి అంటారు కుర్రకారు. ఈ తరాల అంతరం ఎప్పటి నుంచో ఉన్నదే.


తాజాగా.. చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి ఘర్షణ ఘటనే జరిగింది. మదనపల్లెలో ఓ యువతి.. ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా పెద్దలకు చెప్పింది.. కానీ వాళ్లు వింటారా.. వినరు కదా. అంతే కాదు.. బలవంతంగా అప్పటికప్పుడు సంబంధం మాట్లాడేసి పెళ్లి చేద్దామనుకున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని.. ఆ అమ్మాయి.. పరిస్థితి మొత్తం తన లవర్‌కు వివరించింది. ఏకంగా పెళ్లి మండపం నుంచే పరారైంది. నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా పరారై తన ప్రియుడిని చేరుకుంది. అక్కడే ఆ ప్రియుడిని పెళ్లి చేసుకుని మళ్లీ మదనపల్లె వచ్చి పోలీసులను ఆశ్రయించింది.


తాను మేజర్ అని.. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని ఆ అమ్మాయి  పోలీసులను కోరింది.  యువతి మేజర్‌ కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి గతంలోనూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిందట. ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఈనెల 3న డయల్‌ 100కు ఫోన్‌ చేసిందట. అప్పుడు పోలీసులు వచ్చి అమ్మాయి  తల్లిదండ్రులతో మాట్లాడారట.


అబ్బే.. బలవంతంగా ఏమీ చేయం అని పోలీసులకు చెప్పిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఆ అమ్మాయిని హౌజ్ అరెస్టు చేసారు. పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో ఆ అమ్మాయి ఇక లాభం లేదని పెళ్లి మండపం నుంచి పరారైంది. వివాహ సమయంలో అందరూ నిద్రించాక వెళ్లి.. ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులోనే పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: