రాఖీ పండుగ అంటే – అన్నదమ్ముల మధ్య బంధం గుర్తొస్తుంది. చెల్లెళ్లు, అక్కలు… అన్న చేతికి రాఖీ కడతారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో గోండు తెగ మహిళలు మాత్రం – అన్నదమ్ముల్ని కాకుండా… తమ జీవిత భాగస్వాములైన భర్తలకే రాఖీలు కడతారు! అవును… ఇది నిజం. దేశం మొత్తం సోదర ప్రేమను పూజిస్తే… వీళ్లు భర్తను రక్షణగా భావించి ఆయన మెడలో రక్షా కవచాన్ని కడతారు. ఏం ఈ విభిన్న ఆచారం వెనుక నమ్మకం? : గోండు గిరిజనులకు ప్రకృతితో మమేకం ఆయువు గాలి. అడవుల్లో జీవనం, వ్యవసాయమే జీవనాధారం. వారి విశ్వాసంలో – భర్తే సురక్షితమైన జీవితం కోసం దేవుడిచ్చిన వరం. ఆ క్రమంలో రక్షాబంధన్ రోజున భర్తకు రాఖీ కట్టి… జీవితాంతం తనతో పాటు ఉండే రక్షకుడికి కృతజ్ఞత తెలుపుతారు. పైగా ఈ సంప్రదాయం కొత్తగా వచ్చినది కాదు… తర తరాలుగా అలాగే కొనసాగుతోంది.

ఒక్క భర్తకే కాదు… పంటకు, చెట్లకూ రాఖీ! : ఈ గిరిజన మహిళలు భర్తలకు రాఖీ కట్టిన తరువాత పొలాల్లోకి వెళ్లి… పంటలకు, చెట్లకు కూడా రాఖీలు కడతారు. భూమికి రక్షణ కవచం వేయడం ద్వారా… ఆహారాన్ని, జీవనాన్ని ఇచ్చే ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతారు. ఇది చూసి నిజంగా మన మునుపటి కాలపు సంస్కృతి గుర్తొస్తుంది. మనుషులతో పాటు ప్రకృతితో ఉన్న బంధాన్ని గౌరవించడమే వీరి ధర్మం. దేవ్ రాఖీ – స్వయంగా తయారు చేసే విశిష్టత : ఈ తెగ మహిళలు మార్కెట్‌లో లభించే రెడీమేడ్ రాఖీలు వాడరు. బదులుగా పసుపు రంగు దారంతో, దూదితో “దేవ్ రాఖీ”ని తయారు చేస్తారు. రాఖీ కట్టే ముందు ప్రత్యేక పూజలు చేసి… మొదటగా చెట్లకు, పంటలకు, తర్వాత భర్తలకు రాఖీ కడతారు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం.

పురాణాల్లోనూ భర్తకు రాఖీ! :ఇంద్రుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్లే ముందు… శచీదేవి రాఖీ కట్టినట్లు పురాణం చెబుతోంది. ఆ యుద్ధంలో ఇంద్రుడి విజయానికి కారణంగా… ఆ రక్షాబంధనే నిలిచిందని నమ్మకం. అంటే రాఖీ అనేది రక్త సంబంధానికి మాత్రమే కాదు… రక్షణ అందించే ప్రతి బంధానికి గుర్తుగా కూడా భావించవచ్చు. మారుతున్న కాలంలో మారుతున్న ఆచారాలు .. కొత్త తరం కొంతమంది మహిళలు సోదరులకు కూడా రాఖీ కడుతున్నారు. కానీ ఛింద్వాడా జిల్లా బమన్వాడా వంటి గ్రామాల్లో ఇప్పటికీ భర్తలకే మొదట రాఖీ కట్టే సంప్రదాయం నిలిచిఉంది. ఇది కేవలం ఒక పండుగ కాదని, భర్తతో బంధం, ప్రకృతితో భక్తిని కలిపిన అద్భుత ఆచారమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: