పామాయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా వంట నూనెలలో, ఆహార ఉత్పత్తులలో, సౌందర్య సాధనాలలో మరియు బయోఫ్యూయల్‌లో కూడా అత్యధికంగా ఉపయోగించే నూనెలలో ఒకటి. దీని ధర తక్కువగా ఉండటం, ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోవడం, మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం కారణంగా ఇది పరిశ్రమలలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విరివిగా వాడబడుతోంది. అయితే, దీని వాడకం వల్ల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి.

రిఫైన్ చేయని రెడ్ పామాయిల్లో విటమిన్ ఇ, ముఖ్యంగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అయిన టోకోట్రైనోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల డ్యామేజ్‌ను నిరోధించి, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. రెడ్ పామాయిల్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. శరీరం దీన్ని విటమిన్ 'ఏ'గా మారుస్తుంది. ఇది కంటి చూపుకు, రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్లకు ఇది మంచి పరిష్కారం.

పామాయిల్‌లోని టోకోట్రైనోల్స్ న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుండి మెదడును రక్షించడంలో సహాయపడవచ్చు. పామాయిల్ ఇతర నూనెల కంటే అధిక ఉష్ణోగ్రతను (High Smoke Point) తట్టుకోగలదు, కాబట్టి వేయించడానికి (Frying) ఇది అనుకూలంగా ఉంటుంది. ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) ఉండటం వల్ల జీర్ణించుకోవడం తేలికని కొందరు వైద్య నిపుణులు చెబుతారు.

పామాయిల్ పంట రైతులకు అధిక దిగుబడి, స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఒకసారి నాటితే సుమారు 40 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. పామాయిల్‌లో సుమారు 50 శాతం సంతృప్త కొవ్వు (Saturated Fat) ఉంటుంది, ముఖ్యంగా పామిటిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్డీఎల్ (LDL - చెడు కొలెస్ట్రాల్) స్థాయిలు పెరిగి, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పామిటిక్ యాసిడ్ శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్)కు కారణం కావచ్చని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: