విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో బొబ్బిలి ఒకటి. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ వైసీపీదే విజయం. అయితే టీడీపీ గెలిచింది తక్కువసార్లే. అది కూడా ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడునే. తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక మంది నేతలు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ స్థాపించిన వెంటనే జరిగిన 1983 ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో చాలామంది యువ నేతలు జయభేరి మోగించారు. అలా టీడీపీతో రాజకీయ జీవితం మొదలుపెట్టి విజయం సాధించిన నాయకుల్లో శంబంగి ఒకరు. ఈయన 1983,1985,1994 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించారు.