ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఒక అంచనా ప్రకారం అంటార్కిటికా తప్ప మిగిలిన ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాపించిందని సమాచారం. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు.. దాదాపు 90వేల మంది బాధితులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ సినీ నటి, నిర్మాత చార్మి పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది.

 

 

నిన్న దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని.. అదీ హైదరాబాద్ లో అని వార్తలు రావడంతో అంతా కంగారుపడ్డారు. కానీ వెల్కమ్ కరోనా అంటూ చార్మి చేసిన ట్వీట్ పెను దుమారం రేపింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా స్పందించారు. భారతదేశానికి ప్రగతి వచ్చిందనుకుంటున్నావా వెల్కమ్ అంటున్నావు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో తేరుకున్న చార్మి వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందింది. దీనిపై ఆమె ఓ వివరణ ఇస్తూ తన ట్విట్టర్ అకౌంట్ లో మరో పోస్ట్ చేసింది. ‘మీ అందరినీ బాధ పెట్టినందుకు చింతిస్తున్నాను. అనాలోచితంగా చేసిన ఆ ట్వీట్ నన్ను బాధించింది. ఒక ప్రమాదకర పరిస్థితిపై నేను అలాంటి పోస్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇకపై చేసే పోస్టులపై జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటాను’ అని వివరణ ఇచ్చింది.

 

 

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకరి అభిప్రాయాలను తెలిపేందుకు ఓ వేదిక దొరికినట్టైంది. దీంతో ఇలాంటి అనాలోచిత పోస్టులు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచమే వణికిపోతోంది. దీంతో చార్మీ ట్వీట్ అత్యంత వివాదమైంది. కరోనా వైరస్ కేసు హైదరాబాద్ లో నమోదవటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: