ఎవరి పుట్టినరోజైనా స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల మధ్య జరుగుతుంది. మహా అయితే వీధి చివరన ఓ బ్యానర్ కడతారు. పేపర్లో యాడ్ ఇస్తారు. టీవీల్లో యాడ్ కూడా ఇస్తారు. కేక్ కటింగ్స్, భోజనాలు, రెస్టారెంట్ పార్టీలు, నైట్ అవుట్స్.. ఇలాంటి సందడితో తమదైన రోజును ఓ జ్ఞాపకంగా మలచుకుంటారు. అదే.. ఓ సెలబ్రిటీ పుట్టినరోజైతే కాస్త విభిన్నంగా జరుగుతుంది. అదే.. ఓ స్టార్ హీరో పుట్టినరోజైతే కొత్తగా చెప్పేదేముంది. అభిమానులు కేరింతలతో హోరెత్తించేస్తారు. అభిమానాన్ని అనేక రూపాల్లో చూపిస్తారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ ఇప్పుడదే ఎంజాయ్ చేస్తున్నాడు.


నవంబర్ 2న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి తన పుట్టినరోజుకు మరపురాని బహుమతిని దక్కించుకున్నాడు. దుబాయ్ లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫా టవర్ పై షారుఖ్ చిత్రపటంతో బర్త్ డే విశెష్ డిస్ ప్లే చేశారు. లేజర్ లైటింగ్ తో ‘హ్యాపీ బర్త్ డే షారుఖ్..’ అంటూ రంగు రంగుల లేజర్ లైటింగ్ ను ప్రదర్శించారు. ప్రపంచంలోని అరుదైన గుర్తంపు ఉన్న వ్యక్తులకు, సంఘటనలకు మాత్రమే బూర్జ్ ఖలీఫాపై ఇలా లేజర్ లైట్ ను డిస్ ప్లే చేస్తారు. అబ్బురపరిచే పుట్టినరోజు శుభాకాంక్షలు అందడంతో షారుఖ్ మురిసిపోయాడు.


‘ప్రపంచంలోనే ఎత్తైన, పెద్దదైన స్క్రీన్ పై నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త సినిమా విడుదలకు మందే మంచి గిఫ్ట్ దక్కింది. ఇందుకు కారణమైన వారికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. షారుఖ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఆయన క్రేజ్ మాత్రం ఇప్పటికీ టాప్ లోనే ఉండటం విశేషం. త్వరలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఈ బాద్ షా.

మరింత సమాచారం తెలుసుకోండి: