కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు దాదాపు పది నెలల పాటు మూసివేయ బడిన విషయం తెలిసిందే. థియేటర్లు లేకపోవడంతో ఈ కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు దూసుకుపోయాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వరుస వెబ్ సిరీస్‌లు, సినిమాలను వదులుతూ వచ్చింది. కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా అలవాటు పడ్డారు. ఇదిలా ఉంటే.. అమెజాన్ ప్రైమ్‌లో వస్తున్న కొన్ని వెబ్ సిరీస్‌లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగులో కూడా ఏ విధమైన హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమయింది.

మీర్జాపూర్ అనేది ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రాంతం పేరు. మీర్జాపూర్ అనే పేరు పెట్టి యూపీ రాష్ట్ర పేరును కించపరుస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ మత, సామాజిక, ప్రాంతీయ సెంటి మెంట్లను కూడా రెచ్చగొట్టే విధంగా ఉందని, ఇందులో సన్నివేశాల వల్ల మతాల మధ్య చిచ్చు రేగే అవకాశముందంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ మేకర్స్‌తో పాటుగా స్ట్రీమింగ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ సంస్థకు కోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ వెబ్ సిరీస్‌పై కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి మీర్జా పూర్ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.

మీర్జాపూర్ వెబ్ సిరీస్‌పై గతంలో అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్ కూడా విమర్శలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రాంతం సామరస్యానికి, ప్రశాంతతకు కేంద్రంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటువంటి ప్రదేశాన్ని వెబ్ సిరీస్‌లో హింసాత్మక ప్రాంతంగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. దీనిపై విచారణ చేపట్టాలని, అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. మీర్జాపూర్ కథాంశం మొత్తం గ్యాంగ్ వార్ చుట్టూనే తిరుగుతుంది. మొదటి సీజన్ గ్యాంగ్ వార్ అవ్వగా.. ఇటీవల విడుదలైన రెండో సీజన్ మొత్తం రాజకీయాలు, ఎన్నికలు, కుటుంబాల మధ్య వైరుద్యాల చుట్టూ తిరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: