
ధనుష్ తండ్రి కస్తూరి రాజా, తన కొడుకు-కోడలు విడాకుల వ్యవహారంపై స్పందించారు. 18 ఏళ్లు అన్యోన్యంగా కలసి మెలసి ఉన్న వారిద్దరి జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు ఇప్పుడొచ్చాయని, అవన్నీ సమసిపోతాయని చెబుతున్నారాయన. అసలు రజీనీకాంత్ కి కూడా ఈ విడాకుల వ్యవహారం ఇష్టం లేదని, వారిద్దర్నీ కలపాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులంతా కలసి ఓ నిర్ణయం తీసుకుంటామని, త్వరలో ధనుష్-ఐశ్వర్య కలసిపోతారని చెబుతున్నారు కస్తూరి రాజా.
విడాకులు కాదా..? వేరుపడ్డారంతేనా..?
ధనుష్-ఐశ్వర్య అసలు విడాకులు తీసుకోలేదని, వారు కేవలం లీగల్ గా సెపరేట్ గా ఉంటున్నారనే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. వారిద్దరూ విడాకులు ఇంకా తీసుకోలేదని, భవిష్యత్తులో తీసుకుంటారని చెప్పలేమంటున్నారు. కేవలం వారిమధ్య వచ్చిన గొడవల వల్ల విడిపోయి ఉంటున్నారని, పిల్లలకోసం వారు కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇటు ధనుష్ తండ్రి కస్తూరి రాజా ప్రకటనతో హీరో అభిమానులు సంబరపడుతున్నారు. రజినీకాంత్ అల్లుడిగా ధనుష్ తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ కుటుంబంతో దూరం జరిగితే అది ధనుష్ కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో రజినీ సార్ అల్లుడు అని చెప్పుకోడానికే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హీరో విడాకుల వ్యవహారంలో అభిమానులు కూడా కాస్త కలవరపడుతున్నారు. మొత్తమ్మీద ధనుష్ తండ్రి ప్రకటనతో ఐశ్వర్య-ధనుష్ విడాకుల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.