కరోనా వచ్చి బడ్జెట్‌ తగ్గించిందని అందరూ అనుకున్నారు. నటీనటులు.. టెక్నీషియన్స్‌  రెమ్యునరేషన్.. ప్రొడక్షన్‌ కాస్ట్ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని నిర్మాతల మండలి గుర్తించింది. దీనికి తగ్గట్టే బడ్జెట్‌ తగ్గుతుందన్న వార్తలొచ్చాయి. అయితే.. కరోనా రావడంతో.. భారీ సినిమాల బడ్జెట్‌ భారీగా పెరిగిపోయింది.

రాజమౌళి సినిమా గ్రాండీయర్‌గా ఉంటుంది. దీనికి తగ్గట్టే.. బడ్జెట్‌ ఉంటుంది. 300.. 350 కోట్ల అంచనాతో ఆర్‌ఆర్ఆర్‌ మొదలైంది. ఈ ఏడాది జులైలో రావాల్సి ఉండగా అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తికాక.. 2021 జనవరి 8న రిలీజ్‌ చేస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. మూలిగే నక్కపై తాటికాయపడినట్టు.. ఏడాది ఆలస్యంగా అయినా వస్తుందనుకుంటే.. కరోనాతో 10 నెలలపాటు షూటింగ్‌కు దూరమైంది. ఎట్టకేలకు 50 రోజుల నైట్‌ షెడ్యూల్‌ను  పూర్తిచేసినా.. మరోసారి తొందరపడి రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయకుండా జాగ్రత్తపడుతోంది ఆర్ఆర్‌ఆర్‌ యూనిట్‌.

300 కోట్లతో మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ 450 కోట్లకు చేరుతోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. బడ్జెట్‌లో చాలాభాగం ఫైనాన్స్‌కు తీసుకురావడంతో.. వడ్డీనే తడిసిమోపెడు అయిందట. ఆర్‌ఆర్‌ఆర్‌ బడ్జెట్‌ పెరగడానికి ఇదొక కారణమంటున్నాయి ఫిలిం వర్గాలు.

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న హిస్టారికల్ లవ్‌ స్టోరీ రాధే శ్యామ్‌ బడ్జెట్‌కు  కరోనా సెగ తగిలింది. సినిమాను 150..200 కోట్లతో పూర్తి చేసేయాలనుకుంటే.. కరోనా రాకతో ఇటలీ షెడ్యూల్‌ అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఒకటికి రెండుమూడుసార్లు.. ఫారిన్‌కు వెళ్లాల్సి రావడం.. ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరగడంతో.. బడ్జెట్‌ 250కి చేరుతుందని అంచనా వేస్తున్నారు మొత్తానికి భారీ సినిమాల బడ్జెట్ ఆకాశాన్నంటుతోంది. నిర్మాతలు ఎంత తగ్గించుకోవాలనుకున్నా కుదరడం లేదు. అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కొక్క అవసరం మీద వచ్చి పడుతుండటంతో నిర్మాతలు కూడా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా బడ్జెట్ బాగా తగ్గిస్తుందనుకుంటే.. తగ్గడం లేదు కదా.. పెరుగుతూ పోతోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: