పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో హరి హర వీరమల్లు అనే సినిమా తెరకెక్కుతోంది. చారిత్రక నేపథ్యం కలిపి, రాబిన్ హుడ్ సినిమాల తరహాలో హరిహర వీరమల్లు తీస్తున్నారు క్రిష్. గతంలో క్రిష్ సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తీసినా.. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో ఆయన మరో అడుగు ముందుకు వేశారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రను చెప్పేలా బాలకృష్ణను శాతకర్ణిగా చూపించారు. మరీ రాజమౌళిలాగా సిినిమాని చెక్కుతూ కూర్చోకుండా, గ్రాఫిక్స్ తో హడావిడి పడకుండా.. చాలా సీన్లు సహజంగానే చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే శాతకర్ణిలో బాలయ్య నటించిన యుద్ధ సన్నివేశాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఆ తర్వాత దర్శకుడు క్రిష్ తీసిన మణికర్ణిక సినిమా కూడా మంచి విజయాన్ని సాధించినా దాని క్రెడిట్ ఆయనకు ఇవ్వకుండా కంగనా రనౌత్ అడ్డుకున్నారు. దర్శకురాలిగా తన పేరే ఆ సినిమాకు వేసుకున్నారు. కట్ చేస్తే.. మళ్లీ ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాతో వస్తున్నారు దర్శకుడు క్రిష్. ఈసారి పవర్ ఫుల్ హీరో పవర్ స్టార్ ని తీసుకున్నారు. హరిహర వీరమల్లు టీజర్ ఆల్రడీ అంచనాలను పెంచింది. అటు వకీల్ సాబ్ విజయంతో పవన్ కూడా జోరుమీదున్నారు. మరి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను యంగ్ హీరోతో తీసి ఉంటే.. రిజల్ట్ మరోలా ఉండేదని గతంలో విమర్శలు వినిపించాయి. బాలయ్య వల్ల ఆ సినిమా కాస్త నెమ్మదించిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు క్రిష్ చేతిలో పవన్ కల్యాణ్ ఉన్నారు. హరిహర వీరమల్లులో పవన్ చేసిన స్టంట్స్ బాగా వచ్చాయని చెబుతున్నారు. టీజర్ లో కూడా ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ దశలో పవన్ తో చేసే సినిమా సూపర్ హిట్ అయితే నిజంగానే గౌతమీ పుత్ర శాతకర్ణికి బాలయ్యే మైనస్ అనుకోవాలి. క్రిష్ దర్శకత్వానికి వంకపెట్టే అవకాశం ఉండదు.

వకీల్ సాబ్ తర్వాత హరిహర వీరమల్లు విడుదలవుతుందా లేక, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ముందు థియేటర్లలోకి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. వకీల్ సాబ్ హిట్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోడానికి రెండు సినిమాలూ సైమల్టేనియస్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. రాగా పోగా క్రిష్ సినిమాపైనే భారీ అంచనాలున్నాయనేమాట వాస్తవం. పవన్ కల్యాణ్ గతంలో ఎప్పుడూ ట్రై చేయని క్యారెక్టర్ కావడంతో.. పవర్ స్టార్ ని కొత్తగా చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: