మెగాస్టార్ చిరంజీవి నటనలో గానీ.. డాన్స్ లో గానీ.. ఫైట్ సన్నివేశాల్లో గానీ అదరగొడతారు. ఆయన తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో నవ్వు తెప్పించగలరు, అలాగే ఏడ్పు కూడా బాగా తెప్పించగలరు. అయితే ఎలాంటి క్లిష్టతరమైన పాత్రలోనైనా నటించడానికి చిరంజీవి సిద్ధమవుతారు కానీ పాటలు పాడటానికి మాత్రం ఆయన అస్సలు ఇష్టపడరు. పాట పాడాలని ఎవరైనా అడిగితే అమ్మో నా వల్ల కాదు అండి అని వెంటనే చెప్పేస్తారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం చిరంజీవిని బలవంతపెట్టి మరీ ఒక పాట పాడించారు.



వివరంగా తెలుసుకుంటే.. 1997 లో విడుదలైన మాస్టర్ సినిమాలో చిరంజీవి, రోషిని హీరో హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన "తమ్ముడు అరె తమ్ముడు" పాటను చిరంజీవి ఆలపించిన విషయం తెలిసిందే. అయితే సురేష్ కృష్ణ ఈ పాటను పాడాలని చిరంజీవిని అడిగినప్పుడు ఆయన తీవ్ర విముఖత చూపారు. 'పాట పాడనంటే పాడను' అని చిరంజీవి మొండికేసి కూర్చున్నారు. కానీ సురేష్ కృష్ణ మాత్రం పట్టుబట్టి మరీ చిరంజీవిని ఎలాగోలా ఒప్పించారు.



ఐతే 6 నిమిషాల 6 సెకండ్ల నిడివి గల ఈ పాటను చిరంజీవి అయిష్టంగానే పాడారు. అలాగే ఈ పాట విని ప్రేక్షకులు తనని ఖచ్చితంగా ఎద్దేవా చేస్తారని చిరు అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత "తమ్ముడు అరె తమ్ముడు" పాట సూపర్ హిట్ అయింది. దీంతో చిరంజీవి నటనలో మాత్రమే కాదు పాట పాడటం లో కూడా ప్రేక్షకులను అలరించినట్లయింది. అయితే ఇటీవల ఈ విషయాలను మాస్టర్ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: